OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఆయన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. బ్రో చిత్రం తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేశాడు. అయిన మూవీ రిలీజ్ అయ్యాక చిత్రం నిరాశ కలిగించింది. వీఎఫ్ఎక్స్ లో చేసిన మార్పులు కూడా సినిమాను నిలబెట్టలేకపోయాయి. ఫ్లాప్ టాక్ నుంచి బయటపడటానికి పవన్ కెరీర్లో మరో రీఎంట్రీలా ఓజీ కనిపిస్తోంది.
ఓజీ – పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎట్టకేలకు రంగంలోకి దిగుతోంది. మొదటి నుంచీ భారీ అంచనాల మధ్య దూసుకెళ్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఆగస్ట్ 2 నుండి మొదలు కానున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన తొలి సింగిల్ అదే టైటిల్ సాంగ్ కావడం విశేషం. ఈ పాటకు ప్రత్యేకమైన హైపే ఉంది. ‘ఖుషి’లోని “ఏ మేరా జహా” పాటలా ఇందులో ఇంగ్లిష్ లిరిక్స్ కూడా మిక్స్ చేసినట్టు సమాచారం. గతంలో ‘తమ్ముడు’లో రమణ గోగుల కంపోజ్ చేసిన “లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్” తరహాలో ఓ మోడర్న్ వైబ్ అందించనున్నారని తాజా లీక్స్ చెబుతున్నాయి. సంగీతం, లిరిక్స్ నెక్ట్స్ స్టేజ్లో ఉంటాయని టాక్.
ఇక హరిహర వీరమల్లు వల్ల నిరాశ చెందిన పవన్ ఫ్యాన్స్ ఓజీపై మరింత ఆశలు పెట్టుకున్నారు. ఊహించిన ఫలితం హరిహర వీరమల్లుతో రాలేదన్న భాద వారిలో ఉంది. అయితే సెప్టెంబర్ 25న ఓజీ సినిమా థియేటర్లలోకి రావడం ఖాయమని డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ పరిస్థితిలోనూ వెనక్కు తగ్గమన్న సంకేతాలు కూడా ఇస్తుంది. ఈ సినిమా ఫ్యాన్స్ జోష్ని తప్పక పెంచుతుందని అంటున్నారు . ఇప్పటికే చాలా ఏరియాల్లో ఓజీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం టాప్ బయ్యర్లు పోటీ పడుతుండగా, ఇంకా కొన్ని ప్రాంతాల్లో దానయ్య నిర్ణయం తీసుకోలేదట. సాంగ్ రిలీజ్ తర్వాత మార్కెట్ ట్రెండ్ బట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన స్ట్రాటజీ. రిలీజ్ కి ఇంకా 54 రోజులు మాత్రమే ఉండటంతో డివివి టీమ్ ప్రమోషన్లతో సోషల్ మీడియాను ఊపేస్తూ, హైప్ పెంచే పనిలో బిజీగా మారనుంది.