హైదరాబాద్, అక్టోబర్ 17: బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయటపెట్టుకుని మరోసారి అన్నదాత ఆగ్రహానికి గురైంది. తెలంగాణ రైతులను బియ్యం కొనుగోలుపై ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కర్ణాటకలోని శెనగ రైతులను అరిగోస పెడుతున్నది. అక్కడి డబుల్ ఇంజిన్ సర్కారు శెనగల సేకరణను ఏవేవో కారణాలు చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నది. దీంతో గదగ్ జిల్లా రైతులు ఆందోళన బాటపట్టారు.
రాన్లోని తాసీల్దార్ కార్యాలయం ముందు వారు మూడురోజులుగా ధర్నా చేస్తున్నారు. అటుకులు, అరటి పండ్లు తింటూ రాత్రిపగలు అక్కడే గడుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గిడ్డంగిలో చోటులేదంటూ మార్కెట్ అధికారులు దాటవేస్తుండటంతో వారు విసిగిపోయి తాసీల్దార్ ఆఫీసుకు వెళ్లారు. ‘వీలైనంత త్వరలో’ శెనగలు కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించి తాసీల్దార్ తనదారిన తాను వెళ్లిపోయారు. కర్ణాటక శెనగ రైతులు మాత్రం పంట సేకరణ చేపట్టాలని కోరుతున్నారు.