కుత్బుల్లాపూర్, జనవరి 19 : నియోజకవర్గం పరిధిలోని ముంపు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ … జీడిమెట్ల డివిజన్ పరిధిలో భూమిరెడ్డి కాలనీ, శివారెడ్డినగర్, వెంకన్నహిల్స్‌లో స్థానిక సమస్యలపై మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. భూమిరెడ్డికాలనీలో నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీ వంటి సమస్యలపై అధికారులతో చర్చించారు. సుచిత్ర రోడ్డు జీన్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కెమికల్ నాలాను పరిశీలించారు. అనంతరం అక్కడి కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వానాకాలం నాటికి ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సమస్య తిరిగి పునరావృతం కాకుండా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వెంకన్నహిల్స్ నుంచి మొదలుకొని జీన్స్ ఫ్యాక్టరీ వద్ద గల కెమికల్ నాలా వరకు మిగిలిన రిటైనింగ్ వాల్స్‌ను ఎస్ఎఎన్డీపీ నిధులతో పూర్తి చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ క్రిష్ణచైతన్య, ఏఈ సురేందర్‌నాయక్, ఇరిగేషన్ ఏఈ రామారావు, వాటర్ వర్క్స్ మేనేజర్ అనూష, కాలనీవాసులు భూపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పెద్ది మల్లేశ్, ఎం.వెంకట్‌రెడ్డి, సుభాష్, దుర్గారావు పాల్గొన్నారు.