తిరువనంతపురం : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేరళ నన్‌పై లైంగిక దాడి కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు విముక్తి కల్పిస్తూ ప్రత్యేక న్యాయస్ధానం వెలువరించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును నన్ ఆశ్రయించింది.
ములక్కల్‌పై లైంగిక దాడుల ఆరోపణలను అన్నింటినీ తోసిపుచ్చుతూ ప్రత్యేక న్యాయస్ధానం హైప్రొఫైల్ కేసును మూసివేసిన నేపధ్యంలో బాధితురాలు ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై ఆరోపణలను రుజువు చేసే ప్రత్యక్ష ఆధారాలు లేనందున కేరళ చర్చ్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై అభియోగాలను కొట్టాయం న్యాయస్ధానం తోసిపుచ్చింది.
కోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో బిషప్ ములక్కల్ నన్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారని నిరూపించేందుకు తాము అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించామని దర్యాప్తు సంస్ధలు, సంబంధిత అధికారులు చెప్పుకొచ్చారు. కాగా కేరళ నన్‌పై 2014 నుంచి 2016 మధ్య ఫ్రాంకో ములక్కల్ పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా 2018 జూన్‌లో కొట్టాయం జిల్లాలో బిషప్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది.