హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ పరీక్ష-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్‌లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్టీఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కారకులను శిక్షిం చాలని, నీట్ పరీక్ష నిర్వహణను రాష్ర్టాలకే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్యార నరేశ్, చైతన్య యాదవ్, సామిడి వంశీ వర్ధన్‌రెడ్డి, అరుణ్, హరీశ్ అరుణ్, రంజిత్, సుమన్ పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2026 పరీక్ష నిర్వహణలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. అవినీతి, నిర్లక్ష్యం, ప్రైవేట్ మాఫియా, అధికారుల కుమ్మక్కు విద్యార్థులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీట్ లీకేజీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ నాగరాజు, జాతీయ సహాయ కార్యదర్శి ఎండీ అతీక్ అహ్మద్ మాట్లాడుతూ.. నీట్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం మమత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీ కిరణ్, కే అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు భరత్, రమ్య, జూనుగరి రమేశ్, నాగేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.