లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్(38) బుధవారం ఉద యం లక్నోలోని ఓ సివిల్ దవాఖానలో కన్నుమూశారు. వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు ప్రతీక్ యాదవ్ సవతి సోదరుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన వైస్ చైర్పర్సన్ అపర్ణాయాదవ్‌కు ప్రతీక్ యాదవ్ భర్త. ఆయన మృతికి గత కారణాలు అధికారికంగా ఇంకా వెల్లడికాలేదు.
పోస్టుమార్టం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రతీక్ యాదవ్‌ను సివిల్ దవాఖానకి తీసుకురాగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి, స్పృహ కోల్పోవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సివిల్ దవాఖానకి తరలించారు.