హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇవేం ప్రమోషన్లు.. ఇదేం పద్ధతి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పలువురు ఎస్ఈలకు సీఈలుగా, ఈఈలకు ఎస్ఈలుగా కల్పించిన ప్రమోషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం వాటిపై సమీక్షించి సీనియర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 15 చీఫ్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా ఇన్చార్జ్జులతోనే ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. ఇంజినీర్ సంఘాలు ఇదే విషయమై కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ప్రమోషన్లు ఇవ్వాలని, ఇన్చార్జ్జు పాలనావ్యవస్థకు స్వస్తి పలుకాలని అసోసియేషన్లన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అయితే ఇష్టారీతిన ప్రమోషన్లు ఇవ్వడమే ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నది. 8 మంది ఎస్ఈలకు సీఈలుగా, 15 మంది ఈఈలకు ఎస్ఈలుగా ప్రమోషన్ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవలే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) మీటింగ్ నిర్వహించారు.
అందులో ఎస్ఈ నుంచి సీఈలుగా పీ సత్యనారాయణరెడ్డి, శివధర్మతేజ, రాజమ్మ, వాసంతి, సుమతిదేవి, శ్రీదేవి, వరలక్ష్మీదేవి, విద్యావతికి ప్రమోషన్ కల్పిస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. ఇదే ఇప్పుడు ఇంజినీర్ల ఆగ్రహానికి కారణం అవుతున్నది. వాస్తవంగా ప్రమోషన్ జాబితాలోని ఆరుగురు ఇంజినీర్లు అనర్హులని చెప్తున్నారు. అదీగాక వారికంటే సీనియారిటీ జాబితాలో ఉన్న ఇంజినీర్లు సైతం ఉన్నారు. సీఈగా ప్రమోషన్ పొందాలంటే ఏడాది పాటు ఎస్ఈగా సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. దీనినే సాకుగా చూపి ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో ముందువరుసలో ఉన్నా కూడా ఆరుగురు ఇంజినీర్లకు ప్రమోషన్ కల్పించలేదు. అదీగాక మరో నెలరోజులు గడిస్తే సదరు సీనియర్ ఇంజినీర్లు సైతం ఏడాది సర్వీస్ పూర్తి చేసుకొని సీఈ ప్రమోషన్‌కు అర్హత సాధిస్తారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆగమేఘాల మీద నిబంధనల సాకుతో ఆ ఇంజినీర్లను పక్కకు పెట్టి తదుపరి సీనియారిటీ జాబితాలో ఉన్న మరో ఆరుగురికి ప్రమోషన్ కల్పించడం వివాదం రేపుతున్నది. ప్రభుత్వం ప్రమోషన్ కల్పించినవారిలో సైతం పలువురు అనర్హులున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం సీఈలుగా ప్రమోషన్ పొందిన ఎస్ఈల్లో చాలామందికి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు. కొందరు ఉద్యోగంలో చేరిన నాటినుంచి కార్యాలయ విధుల్లోనే కొనసాగుతున్నారు. డీఈఈ నుంచి ఈఈ, ఆపై ఎస్ఈగా ప్రమోషన్ పొందాలంటే రెండేండ్ల పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేది నిబంధన. అయినప్పటికీ సీనియర్లను వదిలి జూనియర్లకు ప్రమోషన్లు కల్పించడం ఇప్పుడు రాద్ధాంతం రేపుతున్నది.
ఇంటర్ స్టేట్ అధికారులపై వివక్ష
ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా పలువురికి ఎస్ఈ నుంచి సీఈలుగా ప్రమోషన్ కల్పించిన ప్రభుత్వం అదే నిబంధన సాకుతో పలువురికి ప్రమోషన్లను నిరాకరించడం సర్కార్ తీరుకు అద్దం పడుతున్నది. ఇరిగేషన్‌శాఖలో, రాష్ట్ర నదీ జలాల హక్కుల పరిరక్షణలో అంతర్రాష్ట్ర జలవిభాగం అనేది అత్యంత కీలకం. ట్రిబ్యునళ్ల అవార్డులు, జలసూత్రాలు, కోర్టు కేసులు, పొరుగు రాష్ర్టాల ప్రాజెక్టులతో రాష్ట్ర జలహక్కులకు భంగం కలుగకుండా చూడడంలో ఈ విభాగమే అత్యంత కీలకం. సుదీర్ఘకాలం పాటు పనిచేస్తేనే ఆయా అంశాలపై అనుభవం, పట్టు లభించే అవకాశం ఉన్నది. అదీగాక ఈ విభాగంలోకి వచ్చేందుకు ఇరిగేషన్‌లోని ఇంజినీర్లు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న ఇంజినీర్లతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఎస్ఈ పోస్టుతోపాటు, ఈఈ, డీఈఈ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ నిబంధన నుంచి మినహాయించి తమకు ప్రమోషన్లు కల్పించాలని విభాగం అధికారులు దాదాపు రెండేండ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధన సాకుతో ప్రమోషన్లు కల్పించడం లేదు. ఇన్చార్జులుగా ఉన్న ఇంజినీర్లకే అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నది. కానీ ప్రస్తుతం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా పలువురు ఎస్ఈలకు సీఈలుగా ప్రమోషన్లు కల్పించడం గమనార్హం. ఇదే విషయమై జలసౌధలో ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ప్రమోషన్లు కల్పించకుండా తాత్సారం చేయడంతో సీనియర్ ఎస్ఈలు ప్రస్తుతం సీఈగా ప్రమోషన్లు పొందలేని దుస్థితి నెలకొన్నదని వివరిస్తున్నారు. ఇకనైనా సర్కార్ వెసులుబాటు కల్పించి, సీనియర్లకే సీఈలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.