Speed Dating | బ్రేక్‌ఫాస్ట్‌లో పరిచయం. కాఫీ తాగుతూ బాతాఖానీ. భోజనం వేళకు ఆలోచనలు పంచుకుంటారు. ఈవెనింగ్ స్నాక్స్ తింటూ ముచ్చట్లాడుకుంటారు. డిన్నర్ సమయానికి ‘డేట్’ ఫిక్స్ చేసుకుంటారు. అంత్యాక్షరి, తంబోలా, మ్యూజికల్ చైర్.. ఆడుతూ పాడుతూ అక్కడున్నవాళ్లలో నచ్చిన వ్యక్తిని ఎంచుకోవడం ఒక్క ‘స్పీడ్ డేటింగ్’తోనే సాధ్యం. ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడానికి ప్రత్యేకంగా కొన్ని సంస్థలూ ఉన్నాయి.
ఆన్లైన్లో ఏం ఉంటుంది? వందలాది ప్రొఫైల్స్ స్వైప్ చేస్తూ పోతాం. నచ్చితే లైక్ చేస్తాం. నచ్చకపోతే మళ్లీ వేట కొనసాగిస్తాం. రుచులు, అభిరుచులు పంచుకుంటాం. కానీ ఫీల్ కనిపించదు. అయితే, కాస్త ఎమోషనల్‌గా ఉండేవారికి ‘స్పీడ్ డేటింగ్’ చక్కటి మార్గంలా కనిపిస్తుంది. ఇక్కడ భావసారూప్యం ఉన్నవాళ్లంతా ఒకేచోట తారస పడతారు. ఈ ట్రెండ్‌ను పసిగట్టి.. స్పీడ్ డేటింగ్ ఈవెంట్స్ నిర్వహించడానికి ‘ప్రేమ్ ఎ కల్చర్ ( Frame a Culture )’ లాంటి సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. స్పీడ్ డేటింగ్ను ఆర్గనైజ్ చేసేవాళ్లు ముందుగా క్లైంట్స్ పేర్లను రిజిస్టర్ చేసుకుంటారు. ‘జోడీ ఎలా ఉండాలి?’ అనే ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా సమాధానం ఇవ్వడం తదుపరి దశ. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే డేటింగ్ హోమ్‌కు తీసుకెళ్తారు. అక్కడ టేబుల్స్‌ను వృత్తాకారంలో అమరుస్తారు. తోడు కోసం వచ్చినవాళ్లంతా ఆ టేబుల్స్ చుట్టూ తిరుగుతూ తమను తాము పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత మ్యూజికల్ చైర్, తంబోలా, అంత్యాక్షరి తదితర ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్లు స్కిట్స్ ప్రదర్శించవచ్చు. పాటలు పాడవచ్చు. ఎవరి ప్రతిభను వాళ్లు చాటుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఎవరో ఒకరికి మన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. మన గురించి కూడా ఎవరో ఒకరు ఆలోచిస్తారు. నచ్చివాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది, కబుర్లు చెప్పాలని అనిపిస్తుంది. మనసులోని భావాలు తెలుసుకోవాలనీ అనిపిస్తుంది. ఆ సమయం కూడా రానే వస్తుంది..
సర్కిల్లో ఉన్న టేబుల్స్ చుట్టూ స్పీడ్‌గా చక్కర్లు కొడుతూ.. ఒకరి తర్వాత ఒకర్ని పరిచయం చేసుకోవడం మూడో దశ. తమకు నచ్చిన వ్యక్తి దగ్గరికి రాగానే బటన్ క్లిక్ చేస్తారు. ఇద్దరూ ఓకే అనుకుంటే.. డేటింగ్ తేదీని నిశ్చయించుకుంటారు. సంప్రదాయం, ఆధునికత కలబోసినట్టుండే ఈ స్పెషల్ ‘మ్యాచ్ మేకింగ్’ ప్రక్రియనే స్పీడ్ డేటింగ్ అని పిలుస్తారు. ఇది యూఎస్‌లో ప్రాచుర్యం పొందింది. స్పీడ్ డేటింగ్లో మొదటి చూపులోనే ప్రేమించే అవకాశం ఉందని అంటున్నారు మానసిక నిపుణులు. ఇదొక ఆటలా ఉంటుంది కాబట్టి, థ్రిల్లింగ్‌గానూ అనిపిస్తుంది. ఒక వ్యక్తిలోని ఆసక్తికరమైన కోణాన్ని అర్థం చేసుకోవడానికి నిమిషాల వ్యవధి సరిపోతుంది. స్పీడ్ డేటింగ్లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ మోసాలకు తావులేదు. ఎవరి ఫొటోలో ప్రొఫైల్‌పిక్‌గా పెట్టుకుని మోసం చేయలేం. రెజ్యూమేలోని పుట్టినతేది, చదువు, ఉద్యోగం, జీతం, వైవాహిక స్థితి.. తదితర విషయాలకు సంబంధించి నిర్వాహకులు ఆరంభంలోనే వెరిఫికేషన్ నిర్వహిస్తారు. దీంతో అబద్ధాలకు అవకాశం ఉండదు. ఆడుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు.. ఎవరైనా సాధ్యమైనంత సహజంగా ఉంటారు. ముసుగులు తీసేస్తారు. అలా లోపలి మనిషిని బేరీజు వేయడానికి అవకాశం దొరుకుతుంది.
ఏదైనా వస్తువు కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. మరి కలిసి జీవించాల్సిన వ్యక్తి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? ఆ అవకాశాన్ని స్పీడ్ డేటింగ్ కల్పిస్తుంది. మనముందు.. బారులుతీరిన బ్రహ్మచారులు, కోకొల్లలుగా వధువులు. ఏవో కారణాల వల్ల అవతలి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోలేకపోవచ్చు. కానీ స్నేహితులుగా ఆమోదించవచ్చు. స్పీట్ డేటింగ్ ద్వారా ఆలూమగలైనవాళ్లు ఎంతమందో, దోస్తులుగా స్థిరపడినవారూ అంతేమంది. గుర్‌గ్రామ్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న దీప్ సరదాగా స్పీడ్ డేటింగ్ ఎంపికకు వెళ్లాడు. గంట వ్యవధిలో 100 మందిని కలిశాడు. ఇరవై మందితో మాట్లాడాడు. ఆట ముగిసే సమయానికి ఇద్దరమ్మాయిల పేర్ల పక్కన క్లిక్ చేశాడు. వాళ్లిద్దరూ ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నారు. పేరుకు ‘స్పీడ్ డేటింగ్’ అయినా, ఇదో నెట్వర్కింగ్ మంత్రం కూడా. ‘మేం ప్రేమ్ ఎ కల్చర్ స్థాపించడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే’ అంటారు ఆ వేదిక నిర్వాహకులు ఆర్తి భండారి, గీతిక అరోరా. హైదరాబాద్‌లాంటి చోట్ల ‘లైఫ్ ఆఫ్ లైన్’ వంటి సంస్థలు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఇరవైల నుంచి అరవైల వరకూ ఎవరికి నచ్చిన జోడీని వాళ్లు వెతుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రెండువేల రూపాయల నుంచీ ఎంతైనా ఉండవచ్చు. మహిళలకు యాభైశాతం డిస్కౌంట్.
“ప్రేయసి చేతిలో చెయ్యేసి నడిస్తే ఇంత అడ్వంటేజ్ ఉంటుందా!!”