సూర్యాపేట : రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy ) ఆరోపించారు. కాలమో, ఎల్నినో ( ElNino ) తో వచ్చిన కరువు కాదు.. ముమ్మాటికీ కాంగ్రెస్ సృష్టించిన కరువే ( Drought ) నని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై ప్రభుత్వానికి దున్నపోతుపై వాన పడ్డట్టుందని ఆరోపించారు. పాము తన పిల్లలను తానే చంపుకున్నట్లు.. కాంగ్రెస్ తెలంగాణ రైతాంగాన్ని చంపుతుందని విమర్శించారు.
కృష్ణా, గోదావరి నీళ్లు ఎట్లా పోతున్నాయో కేటీఆర్, తాము కళ్లకు కట్టినట్లు చూపించినం. సుందిళ్ల, అన్నారం బ్యారేజులు మంచిగున్నాయని సెంట్రల్ వాటర్ కమిషనే స్పష్టంగా తెల్చింది. 75 రోజుల్లో గోదావరిలో 150 టీఎంసీ నీళ్లను వృధాగా సముద్రం పాలు చేశారని మండిపడ్డారు. కృష్ణాలో 150 టీఎంసీల నీటిని ఆంధ్రా పాలు చేశారని ఆరోపించారు.
ఆంధ్ర సీఎం అనధికార ఉత్తరులతో అక్రమంగా నీళ్లను దోచుకు పోయారని విమర్శిం చారు. వంద శాతం రేవంత్ రెడ్డి అనుమతితోనే జరుగుతుందని పేర్కొన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే సాగర్ గేట్లు కొంతమేరా వదిలిపెట్టారని వివరించారు. కుడికాలువకు నీళ్లిచ్చి ,ఎడమ కాలువకు ఎందుకు ఇస్తలేరని మంత్రులకు అడిగే సోయికూడా లేదని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో రైతాంగానికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, నియోజకవర్గం ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.