కొండమల్లేపల్లి, అగష్టు 29 : అనుమానాస్పధంగా గుర్తుపట్టలేని ఓ మగ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శనివారం కొండమల్లేపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ అజ్మీర రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసాని లింగారెడ్డి క్రషర్ మిల్ సమీపంలోని గుట్టల మద్య చెట్ల పొదల పక్కన సగం కాలిపోయిన మృతదేహం ఉండడంతో క్రషర్ మీల్లో పనిచేసే వ్యక్తులు చూసి వేంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు ఉండవచ్చని, నలపు రంగు చెప్పులు, డబ్బాల గీతల చొక్కా, ఎరువు రంగు తువ్వాల మృతదేహం పక్కన కవర్లో దుప్పటి ఉన్నాయి.
వీటితో పాటు ఇంజక్షన్ నీడిల్, కాలిపోయిన దుస్తులు ఉన్నాయి. వ్యక్తి సుమారు ఐదారు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చు అన్నారు. మృతదేహం మాడిపోయిన స్థితిలో ఉండడంతో అది కాల్చి చంపారా? లేకుంటే ఎవరైనా హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి మృతదేహాన్ని కాల్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహం అచూకీ తెలిస్తే కొండమల్లేపల్లి ఎస్ఐ 8712670226, కొండమల్లేపల్లి సీఐ 87126070157 నంబర్లకు తెలుపాలన్నారు.