Godavari | హైదరాబాద్, జూలై15 (నమస్తే తెలంగాణ) : బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరిలో వరద జలాల్లేవని, ఆ కాన్సెప్ట్ అనేది లేదని కేంద్ర జల్‌శక్తిశాఖ మాజీ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ మాజీ చైర్మన్ వెదిరె శ్రీరాం తేల్చిచెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఎగువ రాష్ర్టాలు నీటిని వినియోగించుకోకపోవడం వల్లే దిగువకు జలాలు తరలిపోతున్నాయే తప్ప మరేమీ లేదని స్పష్టం చేశారు. ఆ విధంగా సగటు ప్రవాహాలను లెక్కగట్టినా నికరంగా 1,138 టీఎంసీలు మాత్రమే ఉంటాయని, అయితే అందులోనూ బేసిన్‌లోని అన్నిరాష్ర్టాలకు వాటా ఉంటుందని వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల లింక్ ప్రాజెక్టు ట్రిబ్యునల్ అవార్డుకు, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని నొక్కిచెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల ఎగువన బేసిన్ రాష్ర్టాలకే కాకుండా, ఏపీకి సైతం తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరి నీటి వనరులు-వాస్తవాలు- గణాంకాలు- తెలుగు రాష్ర్టాలు ముందుకు సాగేదారి అనే అంశంపై లక్డీకాపూల్ అశోక హోటల్లో మంగళవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు కాప్ర ప్రసాద్‌రావు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో వెదిరె శ్రీరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గోదావరి బేసిన్, సబ్ బేసిన్ల వారీగా, ట్రిబ్యునల్ అవార్డులు, రాష్ర్టాలకు చేసిన నికర కేటాయింపులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా వెదిరె శ్రీరాం మాట్లాడుతూ మిగిలిన ట్రిబ్యునల్ అవార్డులకు గోదావరి వాటర్ డిస్యూట్ ట్రిబ్యునల్-1 అవార్డుకు పూర్తి భిన్నమని వివరించారు. పూర్వ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాలు చేసుకున్న అంతరాష్ట్ర ఒప్పందాలనే ట్రిబ్యునల్ అవార్డుగా బచావత్ ప్రకటించారని, గోదావరిని 12 సబ్ బేసిన్లుగా విభజించారని వివరించారు. ఒక బేసిన్లో ఒక రాష్ర్టానికే పరిమితమై ఉంటే అక్కడ మాత్రమే ఆల్ వాటర్స్ అనే పదాన్ని వాడారని తెలిపారు. ఒక బేసిన్ పరిధిలోకి ఒకటికి మించి రాష్ర్టాలు విస్తరించి ఉంటే ఒక నిర్దిష్ట ప్రాజెక్టుల వరకు ఆల్ వాటర్స్ ఎగువ రాష్ర్టాలకు, ఆ తరువాత మిగులు జలాలు ఇతర రాష్ర్టాలకు అనే అర్థంలో రిమైనింగ్ వాటర్స్ అనే పదాన్ని వాడారని వివరించారు. ఆ విధంగా ఉమ్మడి ఏపీకి రిమైనింగ్ వాటర్స్ అనేవి కేటాయించారని, విభజన అనంతరం ఆ జలాల్లో తెలంగాణ, ఏపీ సహా హక్కులను కలిగి ఉంటాయని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 75 శాతం డిపెండబులిటీ అంటే కనీసం 4ఏండ్లలో మూడేండ్ల పాటు నీటిలభ్యత ఉండటంతోపాటు, ఆయకట్టు రైతులకు విజయవంతంగా నీరందించగలిగేలా ఉండాలని తెలిపారు. దాని ప్రకారమే సీడబ్ల్యూసీ ఆల్వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, ట్రిబ్యునల్ ప్రత్యేక కేటాయింపులను కలిపి అష్యూర్డ్ వాటర్‌గా అన్వయించి బేసిన్ రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నదని వెల్లడించారు.
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గోదావరి బేసిన్లో 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా సర్ప్లస్ వాటర్ లభ్యత లేనేలేదని వెల్లడించారు. 75 శాతం డిపెండబులిటీ ప్రకారం గోదావరిలో 3,396.9 టీఎంసీల ప్రవాహాలు ఉండగా, సగటు ప్రవాహాలు 4,535.1టీఎంసీలని, 75శాతం కంటే పైగా ఉండే సగటు నీళ్లు కేవలం 1,138.2 టీఎంసీలు మాత్రమేనని వెల్లడించారు. ఇవి కూడా ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు జలాలను ఎగువ రాష్ర్టాలు వినియోగించుకోకపోవడం వల్ల, ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుకోకపోవడం వల్లనే దిగువకు వెళ్తున్నాయని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ దాదాపు 400 టీఎంసీలను వినియోగించుకోవడం లేదని, తెలంగాణ సైతం కాళేశ్వరం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్, దేవాదుల తదితర ప్రాజెక్టులకు కేటాయించిన దాదాపు 400 టీఎంసీల జలాలను పూర్తిగా వినియోగించుకోవడం లేదని, మహారాష్ట్ర, ఒడిశా సైతం కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోవడం లేదని గుర్తుచేశారు. బేసిన్ రాష్ర్టాలన్నీ నికర కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకుంటే 75 శాతం డిపెండబులిటీ కింద దిగువన మిగులు జలాలన్నవే ఉండబోవని సీడబ్ల్యూసీ ఎన్‌డబ్ల్యూడీఏ గతంలోనే చెప్పిందని వెదిరె శ్రీరాం తేల్చిచెప్పారు. ప్రస్తుతం దిగువకు వెళ్తున్న 1,138.2 టీఎంసీల జలాలు తెలంగాణ, ఏపీకే కాకుండా బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు చెందినవని నొక్కిచెప్పారు. ఆ జలాలపై ఏ రాష్ర్టానికీ చట్టబద్ధమైన హక్కు ఉండబోదని శ్రీరాం స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వరద జలాల ఆధారంగా ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు ట్రిబ్యునల్ అవార్డుకు, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని వెదిరె శ్రీరామ్ మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారు. వరద జలాలనే కాన్సెప్ట్ దేశంలోనే లేదని, శాస్త్రీయమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదిస్తున్న, ప్రస్తుతం చెప్తున్న వరద జలాలనేవి ఊహాజనితమే తప్ప మరేమీ కాదని వివరించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేం ద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), గోదావరి రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) అనేక సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తాయని గుర్తుచేశారు. పూర్తిగా సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని పునరుద్ఘాటించారు. బనకచర్లను చేపడితే బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల నుంచి మరోసారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మీడియా ప్రతినిధులతో వెదిరె శ్రీరాం చిట్‌చాట్ నిర్వహించారు. జీసీ లింక్ ప్రాజెక్టులో మళ్లించనున్న 147 టీఎంసీలకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ గతంలో అంగీకారం తెలిపినా, ప్రస్తుతం విముఖత చూపుతున్నదని తెలిపారు. సొంతంగా పలు ప్రాజెక్టులను చేపడుతున్నదని వివరించారు. అయినప్పటికీ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపులు జరుపుతున్నదని, ఆ రాష్ర్టాన్ని ఒప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ అంగీకరిస్తే ఆర్థిక ప్యాకేజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టులకు జీసీ లింక్ ప్రత్యామ్నాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎత్తుపెంచి ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే మేడిగడ్డ బరాజ్‌తో పని లేకుండా నీటిని అందించవచ్చని, రాయలసీమకు నీళ్లను తరలించవచ్చని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వరెస్ట్ డిజైన్ దేవాదుల ప్రాజెక్టని, ఎలాంటి ఆనకట్ట లేకుండా నదిపై మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మళ్లించేలా రూపొందించారని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో తగిన స్టోరేజీ లేదని వివరించారు. స్టోరేజీ కెపాసిటీ లేకపోవడం వల్లే తెలంగాణ గోదావరి జలాల వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నదని వెదిరె శ్రీరాం ఈ సందర్భంగా వెల్లడించారు. స్టోరేజీల పెంపుపై దృష్టి సారించాలని అవసరముందని సూచించారు.
ఏపీ చేపట్టిన జీబీ లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీరని నష్టమని వెదిరె శ్రీరాం ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. ఎస్సారెస్పీ సహా పలు ప్రాజెక్టులు పూడికతో నిండిపోవడం, మరోవైపు కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉండగా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోవడం లేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని, నీటి వినియోగానికి ఇబ్బందులు ఏర్పడుతాయని, ఆపరేషన్ ప్రొటోకాల్‌లో మార్పులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. కేటాయింపుల మేరకు అన్ని రాష్ర్టాలు తమ నీటివాటాలను వినియోగించుకున్న తరువాతే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఆ మిగులు జలాల్లోనూ బేసిన్ రాష్ర్టాలకు వాటా ఉంటుందని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పిన నేపథ్యంలోనే 75శాతం డిపెండబులిటీపై ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీలనే మళ్లించడం ద్వారా గోదావరి -కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించిందని వెదిరె శ్రీరాం తెలిపారు.