ఆర్మూర్, మార్చి 27 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను హింసిస్తుంటే తెలంగాణలో మాత్రం రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించి రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతులను పోస్టల్, కొరియర్ ద్వారా ప్రధాని మోదీకి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నదాతలకు అసలు సిసలైన బంధువు సీఎం కేసీఆర్ అని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వ పాలనలోని పాపాలు దేశ రైతులకు శాపాలుగా మారాయన్నారు. బీజేపీ రైతు భక్షక పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొనేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీ దిగొచ్చే వరకు ఉద్యమ జ్వాల ఆగదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టం చేయకుండా సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకులు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు.
కేంద్రం సహకరించకపోయినా రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రూ.25 వేల కోట్లతో చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితంగా పల్లెల్లో జలకళ ఉట్టి పడుతున్నదని అన్నారు. దేశమే ఆశ్చర్యపోయేలా రాష్ట్రం ఎనిమిదేండ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. ఒకప్పుడు అన్నమో రామచంద్ర అని బాధపడిన తెలంగాణ రైతులు.. నేడు నలుగురికీ తిండిపెట్టే స్థాయికి ఎదిగారన్నారు. ద్రౌపదిని అవమానించిన కౌరవులు, సీతను అపహరించిన రావణుడు చరిత్ర లేకుండా పోయారన్నారు. రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్‌తో గోక్కున్నోడెవడూ బాగు పడలేదన్నారు. రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగయ్యాయని గుర్తుచేశారు. ఇదేరీతిన పంజాబ్‌లో బీజేపీకి గుండు సున్నా మిగిలిందన్నారు. నూకలు తినాలంటూ వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయల్ రాజకీయ భవిష్యత్తుకు నూకలు చెల్లడం ఖాయమన్నారు. ధరలు పెంచి లక్షల కోట్లు దోచుకుంటున్న కేంద్రానికి తెలంగాణ వడ్ల కొనుగోలుకు రూ. 12 వేల కోట్లు ఇవ్వడానికి మనసు రావడం లేదన్నారు. పట్టణంతోపాటు మండలంలోని అన్ని సొసైటీల్లో ధాన్యం కొనుగోలుపై తీర్మానాలు చేశారు. ఎంపీపీ నర్యయ్య, జడ్పీటీసీ సంతోష్, ప్రజాప్రతినిధులు, సొసైటీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.