నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 30: ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె మృతికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన తన కార్యాలయంలో ఆదివారం వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దఎక్లారాకు చెందిన దేవకథే గోవింద్ రావు(31)కు రెండేండ్ల క్రితం హైదరాబాద్‌లోని అత్తాపూర్ కల్లుబట్టీలో మశాగాల్ల లావణ్యతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో మాధవనగర్ సాయిబాబా ఆలయంలో వివాహం చేసుకున్నారు. మొదటి భర్తను వదిలి పెట్టి గోవింద్ రావును రెండో పెండ్లి చేసుకున్న లావణ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
గోవింద్రావు, లావణ్య డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి సమయంలో లావణ్య పెద్ద కూతురు (6) కాలికి దెబ్బ తగలడంతో ఆమెను గోవింద్రావు డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని మెంట్రాజ్‌పల్లి గ్రామం వైపు బాలికను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తరలించగా.. చికిత్సపొందుతూ బాలిక మృతి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న గోవింద్రావు తనపై ఫిర్యాదు చేయకుండా లావణ్యను ఏమార్చి పరారయ్యాడు. పోస్టుమార్టంలో బాలికపై లైంగికదాడి జరిగినట్లు తెలియడంతో పోలీసులు తల్లి లావణ్యను విచారించారు. తన కూతురు మృతికి రెండో భర్త కారణమంటూ వెల్లడించడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 29న నిందితుడు తన వస్తువుల కోసం ధర్మారం గ్రామానికి రావడంతో అతడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, హత్యానేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. కేసును ఛేదించిన డిచ్పల్లి సీఐ డి.మోహన్, ఎస్సై కె.గణేశ్, సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు పరమేశ్వర్, ప్రభాకర్, కానిస్టేబుళ్లు వై.శ్రీనివాస్, కె.శ్రీనివాస్‌ను సీపీ నాగరాజు అభినందించారు.