నిజామాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలతో మండు టెండల్లోనూ పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయి నిగా పేరొందిన ఎస్సారెస్పీ గతం కన్నా మిన్నగా సేవలందిస్తున్నది. పునర్జీవ పథకానికి ముందు వరకు ప్రతి ఎండాకాలంలో బోసిపోయిన చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్న సాగు విధానాల కారణంగా నిండుకుండలా దర్శనం ఇస్తున్నది. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో మూడేండ్లుగా సగానికి ఎక్కువ నీరు నిల్వ ఉండడంతో యాసంగి సాగుకు ఎ లాంటి ఢోకా లేకుండా పోతున్నది. నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ సాయంతో వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు గోదావరి జలాలే ఆయువు పట్టుగా మారింది. మరోవైపు ఎస్సారెస్పీ ద్వారా సరస్వతి, కాకతీయ, వరద కెనాల్ ద్వారా సాగుకు జలాలు గలగలమంటూ తరలి వెళ్తున్నా యి. పంటలు చివరి దశకు చేరడంతో చివరి తడి కింద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు భూములకు నీళ్లు పారుతున్నాయి. ప్రస్తుతం రోజు కు 7687 క్యూసెక్కుల మేర సాగు నీళ్లు వివిధ మార్గాల్లో పొలాలకు చేరుతున్నాయి. సాగుకు తరలుతున్న నీళ్లతోనే జెన్కో ద్వారా విద్యుత్‌ను సైతం రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తుండడం విశేషం.
లక్షల ఎకరాలకు ఊపిరి…
ఎస్సారెస్పీ పరిధిలో కాకతీయ కాలువ ద్వారానే అత్యధిక స్థాయిలో ఆయకట్టుకు సాగు నీరు చేరుతున్నది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో స్టేజ్-1 కింద 9లక్షల 65 ఎకరాలకు నీరు అందుతున్నది. కాకతీయ కాలువ పరిధిలో ఎల్ఎండీ ఎగువ 4.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉం ది. ఎల్ఎండీ దిగువ మరో 5లక్షల ఎకరాలు ఉన్నది. ఎల్ఎండీలో కాళేశ్వరం జలాలతో నీళ్లు పూర్తి స్థాయిలో ఉండడంతో మొత్తం ఆయకట్టుకు నీళ్లు అందే విధంగా యాసంగి సీజన్ మొదలైనప్పటి నుంచి నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతి లో నీటిని విడుదల చేస్తూ రైతులకు సాగు నీటి తి ప్పలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మే 18 వరకు సాగు నీరు అందించేందు కు నీటి షెడ్యూల్‌ను ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఏప్రిల్ 18 వరకు, గుత్ప ఎత్తిపోతల ద్వారా ఏప్రిల్ 30వరకు 7 తడు ల్లో నీరు అందించేలా పకడ్బందీ వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో 4లక్షల 68 వేల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా ఇందులో నిజాంసాగర్ ద్వారా దాదాపు లక్ష ఎకరాలు స్థిరీకరించబడుతున్నది. మిగిలిన భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, బోరు బావులు, ఆయా చెరువుల పరిధిలో ఆయకట్టు ఉంది.
ఎస్సారెస్పీలో ప్రస్తుత పరిస్థితి…
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రా జెక్టు మండుటెండల్లోనూ నిండుకుండ మాదిరిగా దర్శనం ఇస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మ ట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1075 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలకు 40.453 టీఎంసీల మేర నీళ్లు నిల్వ ఉన్నాయి. 2021 ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 1074 అడుగుల నీటి మట్టంతో నీటి నిల్వ 37 టీఎంసీలుగా ఉంది. మా ర్చి ఒకటో తారీఖు నాడు సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బాబ్లీ నుంచి అర టీఎంసీ నీళ్లు ఎగువ నుంచి ఎస్సారెస్పీకి చేరాయి. మూడు రోజుల పాటు కాసింత ఇన్‌ఫ్లో కనిపించినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి వరద లేదు. ఎస్కేప్ గేట్ల నుంచి 100 క్యూసెక్కులు, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా 5,500 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు, అలీ సార్ లిఫ్ట్‌కు 540 క్యూసెక్కులు, గుత్ప లిఫ్ట్‌కు 270 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 200 క్యూసెక్కులు చొప్పున ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇక మిషన్ భగీరథ పథకానికి కోరు ట్ల – జగిత్యాల సెగ్మెంట్‌కు 41 క్యూసెక్కులు, ఆదిలాబాద్ – నిర్మల్‌కు 42 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డికి 69 క్యూసెక్కుల చొప్పున జలాలు తరలిస్తున్నారు. ఒక రోజులో ఎస్సారెస్పీ నుంచి వివిధ అవసరాల నిమిత్తం మొత్తం 7839 క్యూసెక్కుల మేర ఔట్‌ఫ్లో కనిపిస్తోంది.
సాగుకు, తాగుకు…
2021, జూన్ 1వ తారీఖు నుంచి వానకాలం సీజన్ ప్రారంభం నుంచి వానలు దంచికొట్టాయి. ఫలితంగా ఎస్సారెస్పీకి తక్కువ సమయంలోనే భారీగా వరద వచ్చింది. గరిష్ఠ సామర్థ్యం తర్వాత మిగిలిన జలాలను జీవ నదిలోకి వదిలేయగా 90 టీఎంసీల నీటినే పొదుపుగా వివిధ అవసరాలకు వాడుకోవడం పరిపాటి. గతేడాది సీజన్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 677.623 టీఎంసీల మేర ఇన్ ఫ్లో వచ్చింది. వానకాలంలో భారీ వరద వచ్చింది వచ్చినట్లే దిగువకు వెళ్లి పోయింది. ఔట్ ఫ్లో రూపంలో వరదను పంపగా సాగు, తాగు నీటి అవసరాలకు ప్రాజెక్టులోని నీటిని వాడుకుంటుండడంతో గడిచిన 10 నెలల నుంచి ఇప్పటి వరకు మొత్తం 655.482 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైంది. పటిష్ట ప్రణాళికతో గోదావరి జలాలను ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా ఐదారు జిల్లాలకు మిషన్ భగీరథ అవసరాలను తీర్చేందుకు పకడ్బందీగా వినియోగిస్తున్నారు. వేసవి కాలం ముంచుకురావడంతో తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నది. త్వరలోనే సాగు నీటి అవసరాలు పూర్తిగా తీరనుండగా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా తాగు నీటి అవసరాలపైనే దృష్టి సారించబోతున్నారు.