నిజామాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఇందూరు : కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొన్నది. కొంత కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా ప్రిపరేషన్‌కు పదును పెడుతున్నారు. గతంలో అనేక ఉద్యోగాలకు పోటీపడి అవకాశాలు దక్కించుకోలేక పోయినవారు, చిన్నపాటి ఉద్యోగాల్లో చేరి ఉన్నతస్థాయి ఉద్యోగాలపై దృష్టి సారించిన వారు రంగంలోకి దిగుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అందిపుచ్చుకోవడంతోపాటు ఆయా మండలాల్లో నెలకొల్పిన గ్రంథాలయాల్లోనూ చదువుకునేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లా గ్రంథాలయంలో కాంపిటేటివ్ బుక్స్ వందల్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన మార్పులు, చేర్పులతో కూడిన పుస్తకాలను గ్రంథాలయ సంస్థ పాలకవర్గం రూ.లక్షలు వెచ్చించి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా గ్రంథాలయానికి వచ్చి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన వసతి కలిసివస్తున్నది.
ఉద్యోగార్థులకు అండగా..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం దశాబ్దాలుగా వేలాది మంది ఉద్యోగార్థులకు వేదికవుతున్నది. ఏండ్లుగా పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఆలంబనగా, అండగా నిలిచింది. సాధారణంగా డబ్బున్న వారు ఖర్చుకు వెనుకాడకుండా ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పయనమవుతుంటారు. తద్వారా మెరుగైన నైపుణ్యాలు నేర్చుకొని పరీక్షలకు సన్నద్ధమవుతారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా ప్రధాన గ్రంథాలయమే ఆయువు పట్టుగా నిలుస్తున్నది.
ఎవరికి వారు పుస్తకాల్లోని అంశాలను సముపార్జన చేసుకుంటూ పోటీని తట్టుకొని ఉద్యోగాలను సాధించేందుకు శ్రమిస్తుండడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు జంబో నోటిఫికేషన్ల జారీకి నిర్ణయం తీసుకోవడంతో గ్రంథాలయానికి పూర్వకళ వచ్చింది. ఉద్యోగార్థులు అనేక మంది గ్రంథాలయానికి పరుగులు తీస్తున్నారు. ఉదయం 8గంటలకే చేరుకొని పుస్తక పఠనంలో మునిగి తేలుతున్నారు. నోటిఫికేషన్లకు సమయం ఆసన్నం కావడంతో వీరి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకుండా గ్రంథాలయంలో ఖాళీ లేకుండా పోయింది. యువతీ, యువకులతో కిక్కిరిసిపోతున్నది.
ఎమ్మెల్సీ కవిత ఔదార్యం…
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాలుగున్నరేండ్లుగా అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సొంత ఖర్చుతో గ్రంథాలయంలో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఎంపీగా ఉన్న సమయంలో మొదటగా నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో కల్వకుంట్ల కవిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. వీటితోపాటు కొద్దిరోజులకే బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లో నిత్యాన్నదానం మొదలైంది. ఇలా ఎమ్మెల్సీ కవిత నిర్వహిస్తున్న అన్నదానం ప్రభుత్వ దవాఖానలకే పరిమితం కాలేదు. ఆకలి బాధ తెలియకుండా పేద విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలన్న ఆలోచనతో జిల్లా గ్రంథాలయంలో 2018, జూలై 15న అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు. కొవిడ్-19 సమయంలో కాసింత విరామం తప్పితే నిరాటంకంగా సాగుతున్న మధ్యాహ్న భోజన సౌకర్యంతో చాలా మంది ఉద్యోగార్థులకు మేలు కలుగుతున్నది. ప్రిపరేషన్ కోసం ఉదయమే గ్రంథాలయానికి వచ్చిన వారంతా మధ్యాహ్నం బయటికెళ్లాల్సిన అవసరం తప్పింది. తద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నది.
వైఫై సౌకర్యం…
జిల్లా గ్రంథాలయంలో వైఫై సౌకర్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. భిన్న పుస్తకాల భాండాగారంతోపాటు ఇంటర్నెట్ను నేరుగా పాఠకుల సెల్ఫోన్లకు కల్పించడంతో ఏ సమాచారమైనా ఇట్టే విశ్లేషించుకునే వెసులుబాటు కలుగుతున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో పొందుపర్చిన పాఠాలు, ఇతరత్రా ఈ-బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడంలోనూ ఈ సౌకర్యం కీలకపాత్ర పోషిస్తున్నది. నోటిఫికేషన్ల జాతర మొదలవ్వనున్న నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గం సైతం అప్రమత్తమైంది. అభ్యర్థుల తాకిడి పెరిగే ఆస్కారం ఉండడంతో తగు ఏర్పాట్లలో బిజీగా మారబోతున్నది. అవసరమైన కొత్త పుస్తకాలను తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడున్న కాంపిటేటివ్ పుస్తకాలతోపాటు అదనంగా మరిన్ని బుక్స్ తెప్పించబోతున్నారు. డిమాండ్ ఉన్న పుస్తకాలను గుర్తించి ఆర్డర్ పెట్టేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.
భోజనం చాలా బాగుంది
ఉదయం నుంచి చదువుకోవడానికి గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల కో సం బువ్వకుండ ఆధ్వర్యంలో రుచికరమైన ఆహారం పెడుతున్నారు. సమయం వృథా కావడం లేదు. అలాగే డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. ఆహారం, నీటి వసతి, టాయిలెట్లు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో ఇక్కడికే వచ్చి చదువుకుంటున్న.
-నవికేశ్
ఇంట్లో తిన్నట్లే ఉన్నది
గ్రంథాలయంలో అందించే భోజనం ఇంట్లో తిన్నట్లే ఉన్నది. దాదాపు రోజుకు 300లకు పైగా విద్యార్థులు ఇక్కడ తింటారు. రెండు కూరలు, ఒక పప్పుతోపాటు మజ్జిగ కూడా ఉంటుంది. రోజుకు రూ.100 ఆదా అవుతున్నాయి. ఆ డబ్బులను పుస్తకాలు, స్టడీ మెటీరియల్ కోసం
ఉపయోగిస్తున్న.
-పవన్, నిరుద్యోగి
సకల సౌకర్యాలు
చదువుకునేందుకు ఇంట్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు. మాకోసం గ్రంథాలయ శాఖ వారు కుర్చీలు, బెంచీలు, పేపర్లు, స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచారు. సమయానికి మంచి ఆహారం పెడుతున్నారు. మంచి వాతావరణంలో చదువుకొని ఉద్యోగం సాధిస్తాను అనే నమ్మకం కలిగింది. ఇంట్లో టీవీ, పక్కింటి చప్పుళ్లు వినిపిస్తే చదవాలనే శ్రద్ధ ఉండదు. ఇక్కడికి వస్తే పక్కవారిని చూసైనా చదవాలనే ఆసక్తి పెరుగుతుంది.
-అపర్ణ, నిరుద్యోగి
ఖానా బీ అచ్చా హై..
ఖానా బీ అచ్చా హై. పురా కితాబ్ హై. ఇక్కడ చదువుకునేందుకు అన్ని సౌలత్లు ఉన్నాయి. ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా పుస్తకాలు తెప్పిస్తే అందరికీ సరిపోతాయి. ఒకరు చదివేదాక వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండదు. గ్రంథాలయ సెక్రటరీకి చెప్పాము.. త్వరలోనే తెప్పిస్తామన్నారు.
– సమీరా, నిరుద్యోగి
వైఫై ఉపయోగపడుతున్నది..
గ్రంథాలయంలో వైఫై సౌకర్యం ఉండడంతో నెలకు రూ.300 వరకు మిగులుతున్నాయి. రోజూ ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ పుస్తకాలతోపాటు ఇంటర్నెట్లో లభించే కరెంట్ అఫైర్స్ లాంటి ముఖ్యమైన సమాచారం, గణాంకాలు, వ్యాసాలు, చరిత్ర తెలుసుకునే ఆస్కారం ఉన్నది.
-హరీశ్ , నిరుద్యోగి
అన్ని సౌకర్యాలు..
గ్రంథాలయానికి వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాజేశ్వర్ చైర్మన్‌గా వచ్చాక రోజుకో గ్రంథాలయ శాఖకు తిరుగుతూ వారికి అవసరమైన మెటీరియల్స్ తెప్పించి సిద్ధంగా ఉంచాం. 24 శాఖల్లో కూడా నిరుద్యోగులు అడిగిన పుస్తకాలు తెప్పిస్తున్నాం. తాజా సమాచారం తెలుసుకునే వారి కోసం వైఫై సౌకర్యం కల్పించాం.
-బుగ్గారెడ్డి, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ
రెండు గంటల సమయం పెంపు
జిల్లాలోని 24 గ్రంథాలయాల్లో నిరుద్యోగులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ తెప్పించాం. కావాల్సినవి ఆర్డర్ ఇచ్చాం. రోజుకు 400 మంది కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు వస్తారు. ఇదివరకు 150 నుంచి 200 వరకు మాత్రమే వచ్చేవారని తెలిసింది. సౌకర్యాలు పెంచడంతో ఎక్కువగా వస్తున్నారు. గ్రూప్-1, 2కు అవసరమైన పుస్తకాలు తెప్పిస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత సహకారంతో రోజుకు 400 మందికి రుచికరమైన భోజనం పెడుతున్నాం. నిరుద్యోగుల వినతి మేరకు సోమవారం నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతాం. మహిళల కోసం టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశాం.
– అరుట్ల రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్