నిజామాబాద్, మార్చి 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతోనూ కూడుకున్నది. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని 9, 10వ షెడ్యూల్ కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తుల, ఉద్యోగుల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ సృష్టించిన వివాదాలు, వ్యతిరేక వైఖరితో పాటు కేంద్ర ప్రభు త్వ బాధ్యతారాహిత్యం, నిర్లిప్తతతో ఉద్యోగాల నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది.
పాత విధానం ద్వారా నియామకాలు చేపడితే స్థానికులకే అన్యాయం జరిగే వీలుంది. రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకే విరుద్ధంగా ప్రక్రియ సాగే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి సవరణ ఉత్తర్వుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేశా రు. పాత జోనల్ వ్యవస్థను రద్దు చేసి నూతన వ్యవస్థకు పురుడు పోశారు. ఆర్టికల్ 371-డీ సవరణ ఉత్తర్వుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం పంపించిన నివేదికను ఆమోదించడానికి కేంద్రం తాత్సారం చేసింది. కుట్ర పూరితంగా బీజేపీ ప్రభుత్వం జాప్యం చేయడం మూలంగానే నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. సీఎం కేసీఆర్ కొట్లాడి రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించడం ద్వారా స్థానికతకు 95శాతం రిజర్వేషన్ దక్కింది.
లోకల్ రిజర్వేషన్ పరిధిలోకి గ్రూప్ -1 పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వం కృషితో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్న త స్థాయి క్యాడర్ దాకా స్థానిక అభ్యర్థులకు 95శాతం రిజర్వేషన్ అమలవుతుంది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2014 వరకు స్థానికత పేరుతో సమైక్యాంధ్ర పాలకులు చేసిన దుర్మార్గపు చర్యలతో ఉద్యోగవకాశాలు ఈ ప్రాంత బిడ్డలకు దక్కలేవు. చదువుకున్నప్పటికీ అవకాశాలన్నీ స్థానికేతరులైనటువంటి ఆంధ్రావాసులకే ఉద్యోగాలు వచ్చేవి.
దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా జరిగిన వివక్ష, దోపిడీకి స్వరాష్ట్రం చేకూరడంతో మేలు దరి చేరినట్లు అయ్యింది. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్లోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా విస్తరించింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవో, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వంటి పోస్టులు గ్రూప్- 1 ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. ఇప్పుడు ఇవన్నీ లోకల్ రిజర్వేషన్ పరిధిలోకి సీఎం కేసీఆర్ తీసుకు వచ్చారు.
60శాతం నుంచి 95శాతం వరకు
గత రాష్ట్రపతి ఉత్తర్వుల లోకల్ రిజర్వేషన్ పరిధి పేరిట స్థానిక నిరుద్యోగులకు తీవ్రమైన నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నియామకాల్లో 60శాతం నుంచి 80శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్ వర్తించేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95శాతం స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, స్థానిక జోన్, మల్టీ జోన్లలో ఈ సౌకర్యాన్ని అనుభవిస్తారు. ఇతర జిల్లాలు, ఇతర జోన్లు, ఇతర మల్టీ జోన్లలో 5శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి స్థానిక నిజామాబాద్ జిల్లా క్యాడర్ పోస్టులకు, బాసర జోన్ పరిధిలోని జోనల్ పోస్టులకు, కాళేశ్వరం మల్టీ జోన్ -1 పరిధిలోని పోస్టులకు అర్హత కలిగి ఉంటాడు.
ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న జోన్- 5, జోన్- 6 మూలంగా అశాస్త్రీయమైన నియామక ప్రక్రియ జరిగేది. జోన్ -6లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలుండేవి. విద్యావకాశాలు ఎక్కువ ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ వాసులు నిత్యం నిజామాబాద్ పోస్టుల్లో దూరిపోవడం మూలంగా వెనుకబాటుకు గురైన ఇందూరు బిడ్డలకు నిత్యం అన్యాయం చోటు చేసుకునేది. హైదరాబాద్ స్థానికత పేరుతో ఆంధ్రావాసులు అనేకులు దొడ్డిదారిలో వచ్చి చేరిన దాఖలాలు సైతం అనేకం ఉండేవి. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ తనదైన చతురతతో రాష్టపతి సవరణ ఉత్తర్వులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నిలబెట్టారు.