డిచ్పల్లి, అక్టోబర్ 20 : మానవ శరీరంలో అతి ముఖ్యమైన గ్రంధి థైరాయిడ్. ఈ గ్రంధిలోని థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిలో అయోడిన్ది కీలకపాత్ర. శరీరంలో అయోడిన్ లోపం తలెత్తితే అనేక రుగ్మతలు ఏర్పడుతాయి. కావున తీసుకునే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు గల ఆహారాన్ని తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. ఖనిజ లవణాలైన అయోడిన్‌తో టీ3 (ట్రై అయోడో థైరోనిన్), 14 అనగా థైరాక్సిన్ అనబడే థైరాయిడ్ హార్మోన్లు తయారు చేయబడుతాయి. అయోడిన్ సహకారంతో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి సక్రమమైన జీవక్రియ, ఎముకల అభివృద్ధి, మెదడు ఎదుగుదల సాఫీగా సాగుతాయి. శరీరంలో అయోడిన్ లోపం ఫలితంగా గాయిటర్, న్యూరోమిక్యులర్ బలహీనతలు హైపోథైరాయిడిజం, వినికిడి బలహీనత, స్పీచ్ బలహీనత, బుద్ధిమాంద్యం, ఇంటెలిజెన్స్ స్థాయి తగ్గడం, చూపు మందగించడం, స్పాస్టిసిటీ, క్రెటినిజం లాంటి రుగ్మతలు తలెత్తుతాయి. గర్భిణుల్లో అయోడిన్ లోపంతో శిశు సమగ్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. శరీరంలో ఉత్పత్తి కాదు కాబట్టి అయోడిన్ కలిగిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక వ్యక్తికి రోజుకు 100-150 మైక్రో గ్రాముల అయోడిన్ అవసరమవుతుంది. అయోడైజ్డ్ సాల్ట్ సముద్ర ఆహారం, పాలు పెరుగు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, అరటిపండ్లు, మాంసం, గుడ్లు తృణధాన్యాలు లాంటి ఆహారంలో అయోడిన్ లభ్యమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో 1.5 బిలియన్లు (1/3 వంతు జనాభా) అయోడిన్ లోపంతో బాధపడుతున్నారని తేలింది. ఇండియాలో 200 మిలియన్ల మంది అనగా (10 శాతం జనాభా) అయోడిన్ లోప రుగ్మతల ప్రమాదంలో ఉన్నారని, 71 మిలియన్లు గాయిటర్ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. సామాన్య జనంలో అయోడిన్ లోపంతో వచ్చే ప్రమాదంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 21న ‘ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినాన్ని’ నిర్వహిస్తున్నారు. అయోడిన్ లోపం తలెత్తకుండా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.