నూతన మద్యం పాలసీకి ఔత్సాహికుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో 24 షాపులను రిజర్వేషన్ కింద ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించారు. దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా.. ఈ నెల 20న లక్కీడ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. గురువారం చివరిరోజు కావడంతో పెద్దఎత్తున టెండర్లు దాఖలు కావచ్చునని భావిస్తున్నారు. ఈసారి కూడా సిండికేట్‌కు తెరలేపిన మద్యం వ్యాపారులు.. దుకాణాలను చేజిక్కించు కునేందుకు పావులు కదుపుతున్నారు. తెరవెనుక ఆబ్కారీశాఖ అధికారులు వారికి సహకరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.
నిజామాబాద్, నవంబర్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతన ఎక్సైజ్ పాలసీకి ఔత్సాహికుల నుంచి స్పందన భారీగానే వస్తున్నది. గురువారం చివరి రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే ఆస్కారం ఉంది. నిజామాబాద్ జిల్లా లో మద్యం వ్యాపారులు అంతా ఒక్కటై తతంగాన్ని నడిపిస్తున్నారు. వ్యాపారుల వెనుక ఆబ్కారీ శాఖ అధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంది. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో సర్కారుకు రావాల్సిన ఆదాయం పరోక్షంగా తగ్గుతున్నది. ఒక్కొక్కరు వివిధ దుకాణాలకు దరఖాస్తులు సమర్పిస్తే వచ్చే ఆదాయం ఎక్కువ. కానిక్కడ చాలా మంది కలిసి ఒక్కో దుకాణానికి పంపకం రూపంలో దరఖాస్తు చేసుకుంటు న్నారు. దుకాణాల కోసం పోటీ పడడం కంటే కలిసికట్టుగా దరఖాస్తు చేసుకు ని… డ్రాలో వచ్చే దుకాణాలను పంచుకోవాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తెర వెనుక ఆ బ్కారీ శాఖ వారే ప్రోత్సహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మద్యం ఎక్కువగా విక్రయించే దుకాణాల వివరాలు, రిస్క్ లేని షాపుల సమాచారా న్ని లిక్కర్ కింగ్‌లకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2021 మద్యం పాలసీ మేరకు 102 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో 24 దుకాణాలను రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించారు. వచ్చిన దరఖాస్తులన్నింటి నుంచి ఈ నెల 20న లక్కీ డ్రా రూపంలో దుకాణాలను కేటాయించనున్నారు.
మహిళల పేరిట దరఖాస్తులు…
మద్యం వ్యాపారంలో రాటుదేలిన వారు, కొత్తగా ఈ వ్యాపారంలో దిగి కాసింత డబ్బులు సంపాదించిన వారు, డబ్బులు సంపాదించాలనుకునే ఔత్సాహికులు చాలా మంది వైన్ షాపులను దక్కించుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని దక్కించుకునేందుకు దరఖాస్తులు చేస్తున్నా రు. దరఖాస్తుల్లో కొత్త రకమైన ట్రెండ్ ఈసారి ఆసక్తి రేపుతున్నది. కొద్ది మంది ఏకంగా మహిళల పేరిట దరఖాస్తులు చేస్తున్నారు. గతంలో ఈ సంస్కృతి కొనసాగినప్పటికీ ఈసారి మరింతగా పెరిగింది. సెంటిమెంట్ పేరిట వ్యాపారులు తమ భార్యలు, తల్లుల పేరు మీద దరఖాస్తులు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇంటి మహిళలతో దరఖాస్తులు చేయించి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 102 దుకాణాలున్నాయి. నిజామాబాద్ టౌన్ సర్కిల్లో 35 దుకాణాలుండగా ఇందులో గౌడ కులస్తులకు 5, ఎస్సీలకు 2 కేటాయించారు. ఆర్మూర్ సర్కిల్లో 26 దుకాణాలకు ఎస్సీలకు 4 దక్కాయి. బోధన్ సర్కిల్లో 18 దుకాణాలకు ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 చొప్పున కేటాయించారు. భీమ్‌గల్ సర్కిల్లో 12 వైన్స్‌లకు గాను గౌడ కులస్తులకు 4, ఎస్సీ 1, ఎస్టీ 1 చొప్పున కేటాయించారు. మోర్తాడ్ సర్కిల్ పరిధిలో 11 వైన్స్‌లకు గాను గౌడ కులస్తులకు 2 దక్కాయి. గురువారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 20న లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
సిండికేట్‌గా మారిన వ్యాపారులు…
ప్రధాన కేంద్రాల్లో ఉన్న మద్యం దుకాణాలను తిరి గి దక్కించుకునేందుకు మద్యం సిండికేట్ బృందాలుగా ఏర్పడ్డారు. మద్యం వ్యాపారంలో బినామీ వ్యవస్థను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది. అయితే మద్యం వ్యాపారం లో రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా వ్యాపారులు ఒక్కటవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించిన మద్యం దుకాణాలను సులువుగా చేజిక్కించుకునేందుకు మద్యం వ్యాపారుల సిండికేట్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ 2021, డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రెండేండ్ల పాటు అమల్లో ఉండనున్నది. ఈసారి అనేక మద్యం దుకాణాలకు పోటీ ఏర్పడిం ది. మద్యం దుకాణాల కోసం ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వస్తే అంత మొత్తం ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది. ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఉన్న మద్యం దుకాణాలను కైవసం చేసుకునేందుకు మద్యం సిండికేట్ బృందాలు పావులు కదుపుతున్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులు, శ్రీమంతులు కూడా మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. తెర వెనుక జరుగుతున్న వ్యవహారాన్ని బయటికి పొక్కకుండా మద్యం వ్యాపారుల సిండికేట్ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ అంశం బహిరంగ రహస్యంగా మారింది. మద్యం వ్యాపారం ఏటేటా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుండడంతో రెండేండ్ల కిందట మద్యం దుకాణాలను లక్కీ డ్రాతో చేజిక్కించుకున్న వారు ఈసారి కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. కొత్త వారూ వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అక్రమాలకు చెక్…
మద్యం విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. గతంలో పర్మిట్ రూములను కొన్ని దుకాణాలకే అనుమతి ఇచ్చేవారు. అయితే, కొంత మంది ఎక్సైజ్ అధికారులు పర్మిట్ రూముల పేరిట అక్రమాలకు పాల్పడడం వెలుగు చూసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి దుకాణదారులతో అక్రమ పర్మిట్ మంజూరు చేశారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు 2017లో అమలు చేసిన నిబంధననే 2019 పాలసీలోనూ పొందుపరిచారు. ఇప్పుడు 2021 మద్యం విధానంలోనూ కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ ట్యాక్స్లోనే పర్మిట్ ఫీజును విలీనం చేయడంతో జిల్లాలో ఏర్పాటు కాబోతున్న అన్ని మద్యం దుకాణాలకు పర్మిట్ రూములు కొనసాగనున్నాయి. మద్యం దుకాణాలకు ఏయే ప్రాం తాల్లో ఎలాంటి పర్మిట్ రూములు ఉండాలో త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయి.
మరోవైపు మద్యం దుకాణాల వద్ద అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు సర్కారు నిశ్చయించింది. క్రయ, విక్రయాలపై నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటును సైతం కచ్చితం చేయనుంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే కొత్త మద్యం దుకాణాల ఏర్పాటు చేయబోతున్నారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే దుకాణాదారుడు డీడీ రూపంలో రూ.2లక్షలు రిజిస్ట్రేషన్ చార్జీని చెల్లించాలి. ఒక వ్యక్తి ఒకే దుకాణానికి లైసెన్సు పొందడానికి అర్హుడు. ఆయా ప్రాంతా ల్లో లైసెన్సులు వేసినప్పటికీ ఒక చోట మాత్రమే దుకాణం సొంతం అవుతుంది.
నిజామాబాద్ జిల్లాలో 725 దరఖాస్తులు
నిజామాబాద్ సిటీ, నవంబర్ 16: నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 725 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్‌చంద్ర తెలిపారు. బుధవారం 348 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 340, ఆర్మూర్ పరిధిలో 106, బోధన్ పరిధిలో 71, భీమ్‌గల్ పరిధిలో 98, మోర్తాడ్ పరిధిలో 110 దరఖాస్తులు వచ్చాయి.
కామారెడ్డిలో ఒక్క రోజే 212 టెండర్లు
కామారెడ్డి టౌన్, నవంబర్ 17: కామారెడ్డి జిల్లాలోని 46 మద్యం దుకాణాలను గాను బుధవారం నాటికి 454 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 212 టెండర్లు వేశారని పేర్కొన్నారు. ఎస్టీలకు కేటాయించిన రెండు దుకాణాలకు 9, ఎస్సీలకు కేటాయించిన 5 దుకాణాలకు 48, గౌడ కులస్తులకు కేటాయించిన ఏడు దుకాణాలకు గాను 50 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఓపెన్ కేటగిరిలోని 35 షాపుల కోసం 347 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నేడు చివరి రోజు అని సాయంత్రం ఐదు గంటల్లోపు వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.