నిజామాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఏటా వేలాది ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తూ రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచించడంతో అన్నదాతలు ఆ వైపుగా దృష్టి సారిస్తూ కూరగాయల సాగుకు సన్నద్ధమవుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్జించడమే కాకుండా, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా సాగుచేస్తే ఏడాది పొడవునా రోజూ రాబడి పొందవచ్చునని వ్యవసాయ నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఆర్మూర్, నవంబర్ 16: సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి అధునాతనమైన పంటలకు నాం ది పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యామ్నాయ పంటలకు స్వాగతం పలుకుతూ గతంలో పండించిన కూరగాయల వైపు రైతులు మరలాల్సి ఉంది. వరి స్థానంలో పప్పుదినుసులు, కూరగాయలను సాగు చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉన్నది. ఇందూరు జిల్లా రైతులు అవసరాలకు వినియోగించే పప్పుదినుసులను, కూరగాయలను వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా రైతులు పప్పు దినుసులతోపాటు కూరగాయలు సాగుచేస్తే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో ఇప్పటికే పలువురు రైతులు పప్పుదినుసులు, కూరగాయలు సాగు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. అంకాపూర్‌లో పంటల సాగుతోపాటు కూరగాయలకూ ప్రాధాన్యమిస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ నుంచి కూరగాయలు, ఇతర పంటలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశంలోని పలు రాష్ర్టాలకు నిత్యం సరఫరా అవుతుంటాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధానంగా వంకాయ, బెండకాయ, టమాట, కాకర తదితర పంటలతోపాటు ఆకు కూరలైన పాలకూర, మెంతికూర, కొత్తిమీరను రైతులు ప్రధానంగా సాగు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు..
ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులు నూతన విధానాలతో లాభసాటి పంటలను సాగు చేస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరు గడించారు. ప్రస్తుతం అదే ఒరవడితో వరికి ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పప్పుదినుసులను సాగు చేసేందుకు ప్రణాళికలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. సర్కారు సూచనలను ఇక్కడి మెజార్టీ రైతన్నలు తూ.చ. తప్పకుండా పాటిస్తూ కూరగాయల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంతోపాటు కోటార్మూర్, పెర్కిట్, గోవింద్‌పేట్, చేపూర్, ఇస్సాపల్లి, ఆలూర్, దేగాం, మచ్చర్ల, మం థని, పిప్రి, ఫత్తేపూర్, సుర్భిర్యాల్ తదితర గ్రామాల్లో రైతులు కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వారికున్న వ్యవసాయ భూముల్లో ప్రభుత్వ సూచనల మేరకు 1, 2 ఎకరాల్లో కూరగాయలను పండించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అంకాపూర్, పెర్కిట్, కోటార్మూర్, ఆర్మూర్, ఇస్సాపల్లి గ్రామాల్లో కూరగాయల సాగుతోపాటు కొత్తిమీర, పాలకూర, మెంతికూర, తోట కూర, పుదీన లాంటి ఆకుకూరలను పండిస్తున్నారు. ఆర్మూర్, నందిపేట్, మా క్లూర్ మండలాల్లో పలు రకాల కూరగాయలతోపాటు పండ్ల తోటలు, పూల తోటలను సాగు చేస్తూ రైతులు లాభాలను గడిస్తున్నారు.
పెట్టుబడి తక్కువ.. ఆదాయం అధికం..
కూరగాయల సాగుకు పెట్టుబడి తక్కువవుతుంది. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్న కూరగాయలకు నీటి అవసరం తక్కువే. సాధారణంగా వరి పంటకు ప్రతిరోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది. కానీ కూరగాయలు, ఇతర ఆకు కూరలకు ఐదు రోజులకోసారి నీటి తడులను అందిస్తే సరిపోతుంది. దీంతో రైతులకు తక్కువ శ్రమ, తక్కువ నీటి వ్యయంతోనే ఆరుతడి పంటలైన కూరగాయలు, పప్పు దినుసులను సాగు చేసుకొని లబ్ధి పొందే అవకాశం ఏర్పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఊర పందుల బెడదతో రైతులు ప్రత్యేకంగా కంచెలను ఏర్పాటు చేసుకొని కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వం పంట భూముల చుట్టూరా కంచెలు ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కూరగాయల సాగు బాగుంది
ఇతర పంటల కన్నా కూరగాయల సాగు బాగుంది. తక్కువ విస్తీర్ణం, తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వస్తుంది. వరి వేస్తే నిత్యం నీరు పెట్టాల్సి వస్తుంది. కూరగాయలకు వారానికోసారి నీటి తడులను అందిస్తే సరిపోతుంది.
-ఇట్టెడి రజితారెడ్డి, మహిళా రైతు, కోటార్మూర్
ఆర్థిక ఇబ్బందులు ఉండవ్..
కూరగాయలు పండిస్తే ఇతర పంటల ఖర్చులకు ఇబ్బందులుండవ్. వరి కంటే కూరగాయలే నయం. తక్కువ పెట్టుబడితో బాగా లాభం వస్తుంది. మా ఊర్లోని చాలా మంది రైతులం కూరగాయలు పెట్టినం. కూరగాయల రేట్లు కూడా బాగున్నయ్. వరి సాగు చేసుడుకంటే కూరగాయలు పండించుడే మంచిగున్నది. కూరగాయల అమ్మకంతో ఎప్పటికప్పుడు పైసలు చేతుల ఉంటయ్.