e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News టీకా.. లక్ష్యం చేరేదాకా..

టీకా.. లక్ష్యం చేరేదాకా..

  • వందశాతం వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి
  • కొత్త వేరియంట్ల పుట్టుకతో ప్రభుత్వం జాగ్రత్తలు
  • అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు
  • జోరుగా సాగుతున్న కరోనా టీకాల పంపిణీ
  • గ్రామాల్లో అవగాహన రాహిత్యంతో ముందుకు రాని జనం
  • శిబిరాల ద్వారా పల్లెల్లో వ్యాక్సినేషన్‌ చేపడుతున్న యంత్రాంగం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారిపై టీకాస్త్రం సంధించే విషయంలో నిజామాబాద్‌ జిల్లా దూసుకుపోతోంది. రోజురోజుకూ కొవిడ్‌ టీకాల పంపిణీలో వేగం పెరుగుతోంది. కొన్ని నెలలుగా పల్లె, పట్టణాల్లో కొనసాగుతున్న టీకాల పంపిణీ తీరులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి, రెండు డోసుల మధ్య కాల వ్యవధిని కేంద్రం నిర్ణయించినట్లుగా నిర్ధిష్ట గడువును కచ్చితంగా పాటిస్తున్నారు. గడువు దాటకముందే రెండో డోసు సైతం ఇచ్చేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా టీకాలు పంపిణీ చేస్తున్నారు. అంతేగాకుండా ఊరూరా వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్తూ టీకాలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల పని ప్రదేశాల్లోనూ టీకాలు ఇస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ అందించేలా పని చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి డోసు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న వారికి అవగాహన కల్పించి టీకా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో కరోనా టీకాల పంపిణీలో వైద్య బృందాలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తున్నాయి.

భయం వీడితేనే…

- Advertisement -

కరోనా వైరస్‌ విస్తృతిలో భాగంగా రోజుకో కొత్త వేరియట్‌ పుట్టుకొస్తున్నది. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి విస్తరిస్తున్న వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు సంపూర్ణ టీకా పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. టీకాల ద్వారా కరోనా విస్తృతిని అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి, పెద్ద ఎత్తున డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌పై రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. టీకా విషయంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి టీకా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ. కొద్ది మంది అవగాహన లేక, అసత్య ప్రచారాలను నమ్మి టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మొదట్లో టీకా కోసం చాలా మంది ముందుకు రాలేదు. ప్రస్తుతం కాసింత అవగాహన తెచ్చుకుని టీకా ఇప్పించుకునేందుకు తరలివస్తున్నారు. కొవిడ్‌ ఉధృతి, వైరస్‌ సృష్టిస్తున్న నష్టంతో ప్రజల్లో కాసింత అవగాహన పెరిగినప్పటికీ ఇంకా టీకా తీసుకోని వారి సంఖ్య ఉండడం ఆందోళనకు గురి చేస్తున్న అంశమే. రెండు నెలల ముందు వరకు వాక్సిన్‌ కోసం బారులు తీరిన సందర్భాలు కనిపించగా, ఇప్పుడు ఇంటి గుమ్మం చెంతకే టీకా పట్టుకుని వైద్య బృందాలు తిరుగుతుండడం విశేషం.

టీకాల్లోనూ మహిళలే అత్యధికం…

జిల్లాలో 13లక్షల 80వేల 937 మందికి కొవిడ్‌ టీకా ఇచ్చారు. ఇందులో 13,17,568 మందికి కొవిషీల్డ్‌, 63,369 మందికి కొవాగ్జిన్‌ ఇచ్చారు. ఫస్ట్‌ డోసు 9లక్షల 72వేల 140 మందికి అందించారు. సెకండ్‌ డోసు 4లక్షల 8వేల 797 మందికి అందించారు. నిజామాబాద్‌లో మొత్తం 283 బృందాల ద్వారా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. 281 బృందాలు నేరుగా ఇంటింటికీ తిరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో సంచరిస్తూ టీకా తీసుకోని వారికి సేవలు అందిస్తున్నారు. మొత్తం టీకా తీసుకున్న వారిలో 6లక్షా 33వేల 444 మంది పురుషులు, 7లక్షల 47వేల 316 మంది మహిళలు ఉన్నారు. 60ఏండ్లు పైబడిన 2లక్షల 14వేల నాలుగు మంది, 45-60 ఏండ్ల వయస్సు వారు 3లక్షా 86వేల 460 మంది, 18-44 ఏండ్ల వయస్సున్న వారు 7లక్షల 80 వేల 473 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా టీకా తీసుకున్న వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బహిరంగ ప్రదేశాలు, జన సంచార ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగేది పురుషులే అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహన రాహిత్యం స్పష్టం అవుతోంది. మహిళలు మాత్రం బాధ్యతగా టీకాలు తీసుకోవడం విశేషం.

వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితం

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే అత్యుత్తమమైన మార్గం. అందరూ టీకా ను బాధ్యతగా స్వీకరించాలి. నిర్లక్ష్యం వహించడం వల్ల వారికే కాకుండా అవతలి వారికి ముప్పును తీసుకువస్తున్నట్లుగా భావించాలి. ఎన్నో ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ వల్ల ఎలాంటి హాని జరుగదు. తప్పకుండా టీకా తీసుకుని సురక్షింతగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం.

  • డాక్టర్‌ ప్రతిమారాజ్‌, సూపరింటెండెంట్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖాన
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement