నిజాంసాగర్, డిసెంబర్ 4: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ రైతులు అందరి కన్నా ముందుగానే ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు యాసంగిలో ఇతర పంటలు వేయాలని సూచనలు చేస్తున్నప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల రైతులు ముందుగానే ఆరుతడి పంటలను వేశారు. ఆరుతడి పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయని, మద్దతు ధర, మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని రైతన్నలు చెబుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, జుక్కల్, బి చ్కుంద, మద్నూర్ మండలాల్లో 1.26లక్షల ఎకరా ల్లో ప్రస్తుత యాసంగిలో పంటలను సాగు చేస్తు న్నారు. ఇప్పటికే సుమారు 81వేల ఎకరాల్లో శనగ, మినుము, పెసర, పత్తి, కంది, చెరుకు, పొద్దుతిరుగుడు విత్తనాలు వేశారు. మరో రెండు వారాల్లో ఆరుతడి పంటల సాగు మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు.
జుక్కల్‌లోనే అధికంగా..
జుక్కల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 1.26లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా ఇప్పటికే 81వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేస్తుండగా మరో రెండు నుంచి మూడు వారాల్లో మరో 10వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసేందుకు రైతన్నలు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా నిజాంసాగర్, పిట్లం మండలాల్లోని రైతులు వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపగా మిగిలిన మండలాల్లో ఆరుతడి పంటలకే మొగ్గు చూపుతున్నారు.
ఆరుతడి పంటలే ఉత్తమం
వరి నుంచి ఆరుతడి పంటల సాగు వైపు మళ్లితే, మళ్లీ వరి వైపు వచ్చే పరిస్థితి ఉండదు. సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తే వరి కన్నా ఆరుతడి పంటలే ఉత్తమం. యాసంగిలో పొద్దుతిరుగుడు, శనగ, జొన్న, మక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. వరి కన్నా ఆరుతడి పంట సాగు చేయడం ఎంతో ఉత్తమం. మద్దతు ధర, మార్కెట్ సౌకర్యం ఇబ్బందులు ఉండవు. పక్కనే మహారాష్ట్రలో ధర అధికంగా ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్ముకుంటున్నాం.
మరింత పెరుగుతుంది
జుక్కల్ నియోజకవర్గంలో 1.26లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉం టే ఇప్పటికే 81వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. మరో 20 రోజుల్లో మిగి లిన భూముల్లో మరికొంత ఆరుతడి పంటలను సాగు చేసేందుకు రైతులు ముందు కు వస్తున్నారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లోని గ్రోమోర్ కేంద్రాల్లో రైతుల కోసం వేరుశనగ విత్తనాలు కూడా సిద్ధం చేశాం.
సిరికొండలోనూ ఆరుతడికే జై..
సిరికొండ, డిసెంబర్ 4: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల రైతులు సైతం ఆరుతడి పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు వరిపై మొగ్గు చూపిన రైతులు ప్రస్తుతం ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. గత యాసంగిలో నర్సింగ్‌పల్లి, గడ్కోల్, న్యావనంది గ్రామాల్లో మాత్రమే ఆరుతడి పంటలు పండించారు. ప్రస్తుతం మండలంలోని 30 గ్రామాల్లోని రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. పొద్దుతిరుగుడు, జొన్న, ఉల్లి, పెసర, నువ్వు విత్తనాలు వేశారు. సిరికొండలో గతేడాది 1200 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేయగా, ప్రస్తుతం వేల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు అనుకూలంగా ఉన్నారు.
ప్రభుత్వ నిర్ణయం మంచిది..
యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించడం మంచి నిర్ణయం. మాకు మేలు కలుగుతుంది. గత యాసంగిలో రెండు ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేశాను. ప్రస్తుతం ఐదు ఎకరాల్లో పొద్దుతిరుగుడు, మక్కజొన్న పంటలు వేశాను.
రైతులకు మేలు..
ఆరుతడి సాగుతో రైతులకు ఎంతో మేలు. మంచి ఆదాయం వస్తుంది. ఐదేండ్ల నుంచి ఆరుతడి పంటలను సాగు చేస్తున్నాను. ఆరుతడి పంటలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది.
-పెద్దోల్ల ఆదిత్య, యువరైతు, కుర్ధుల్పేట్