ఓ వైపు థర్డ్‌వేవ్ భయం.. మరోవైపు అంతేస్థాయిలో నిర్లక్ష్యం.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నదన్న వార్తల నేపథ్యంలోనూ ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. మాస్కుల్లేకుండా, భౌతికదూరం పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. నిర్లక్ష్య పూరిత వైఖరితోనే కంటికి కనిపించని వైరస్ త్వరగా మనుషులను చుట్టేస్తోంది. చూస్తుండగానే ఒమిక్రాన్ దేశాలను దాటుకుని భారత్‌లోకి, మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ విస్తృతిని మొదట్లోనే నిరోధించేందుకు మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్రప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై వెయ్యి వరకు జరిమానా విధించాలని ఆదేశించింది.
నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఓ వైపు కరోనా మూడోవేవ్ వేగంగా విస్తరించే అవకాశం ఉన్నదని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. ఉభయ జిల్లాలో జాగ్రత్తలు పాటిస్తున్న వారే కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు. కరోనా పని అయిపోయింది… ఇంకెక్కడి కరోనా అంటూ మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తన దాకా వైరస్ వస్తే కానీ దాని ప్రభావం అర్థం కావడం లేదు. నిర్లక్ష్య పూరిత వైఖరితోనే కంటికి కనిపించని వైరస్ త్వరగా మనుషులను చుట్టేస్తున్నది. కూరగాయలు, సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో ప్రజలు ఎక్కువగా గుమిగూడుతున్నారు. టీ, టిఫిన్, జ్యూస్ సెంటర్ల వద్ద ఎక్కువగా జనం కనిపిస్తున్నప్పటికీ జాగ్రత్త చర్యలు లేకపోవడం విడ్డూరంగా మారింది. కరోనా వేరియంట్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. సెకండ్‌వేవ్‌లో డెల్టా రూపంలో విస్తరించిన వైరస్ మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ సోకిందనే సమాచారం తెలుసుకునేలా లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మరో వేరియంట్ రూపంలో కరోనా విరుచుకుపడబోతోందని జాతీయ, అంతర్జాతీయ విశ్లేషణలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ ఇప్పటికే దేశంలోకి, రాష్ట్రంలోకి వచ్చేసినందున మాస్కుల వాడకం, భౌతికదూరం అనివార్యం. లేదంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లే.
వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా..
కామారెడ్డి, డిసెంబర్ 3: ప్రపంచ వ్యాప్తంగా గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లాకు సమీపంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు ప్రారంభించింది. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ సరిహద్దుల గుండా జిల్లాలో ప్రవేశించే వారి వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల సర్టిఫికెట్లు పరిశీలించాలని సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు మాస్క్ మస్ట్ నిబంధన పెడుతూనే, వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, మెప్మా, డీఆర్డీవో, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందితోపాటు గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ 18 ఏండ్లు నిండిన వారికి టీకాలు వేయాల ని చేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్ తక్కువ అయిన ప్రాంతాలను గుర్తించి మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 15 రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వైద్య ఆరోగ్యశాఖకు లక్ష్యం పెట్టారు. ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాల వారీగా వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా చేసి 17వ తేదీలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రేషన్‌షాపుల వద్ద వ్యాక్సిన్ వేయాలని వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్‌కు ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో 7,26,377 మందికి టీకాలు ఇవ్వాల్సి ఉండగా, ఫస్ట్ డోస్ కింద 5,80,125 మంది వేసుకోగా, 1,46,890 మందికి వేయాల్సి ఉంది. రెండోడోస్ 2,55,284 మంది వేసుకోగా, మరో 4,71,093 మంది వేసుకోవాల్సి ఉంది. మొదటి డోస్ 80శాతం, రెండో డోస్ 35శాతం మాత్రమే వేసుకున్నారు.
జాగ్రత్తలు గాలికి…
ఎక్కడ చూసినా సరైన జాగ్రత్తలు లేకుండానే ప్రజలు సంచరిస్తున్నారు. కరోనా తీవ్రతపై ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ జనాల్లో మాత్రం భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజర్ల వాడకంపై శ్రద్ధ కానరావడం లేదు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు తమవంతు బాధ్యతగా కొవిడ్-19 నిబంధనలు పాటించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాస్కులు లేకుండానే ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, బస్ స్టేషన్లతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో మాస్కులు ధరించకుండానే తిరుగుతున్నారు. చివరకు ఆలయాలకు కూడా మాస్క్ ధరించకుండానే వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టులోని సెక్షన్ 51 నుంచి 60 ప్రకారం కేసుల నమోదుతో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
సర్కారు కఠిన ఆదేశాలు..
మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి మూడోవేవ్ విస్తృతిని మొదట్లోనే నిరోధించేందుకు మాస్కుల వాడకం ముఖ్యమైన చర్యగా సర్కారు గుర్తించింది. ప్రభుత్వం జీవో జారీ చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. మాస్కు లేకుండా బయటికి రావడం ఇక మీదట కుదరదు. తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెడలో అలంకారప్రాయంగా కాకుండా ముక్కును, నోటిని, గడ్డాన్ని పూర్తిగా చుట్టేసేలా ధరించాల్సి ఉంటుంది. ప్రజలతోపాటుగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సైతం పని ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. గ్రామీణ ప్రాంతాలకూ ఇదే వర్తించనుంది.
రూ. వెయ్యి జరిమానా
కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. కొత్త వేరియంట్ ప్రచారంలో ఉన్నందున వ్యాపించకుండా మాస్కులు ధరించాలి. మాస్కు ధరించకుంటే రూ.1000
జరిమానా విధిస్తాం.
వ్యాక్సినేషన్ వేగిరం చేస్తున్నాం..
కామారెడ్డి జిల్లా పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. అధికారులు, సిబ్బంది అలసత్వం వహించకుండా మొదటి, రెండో డోసులను 18 ఏండ్లు నిండిన వారందరికీ అందించాలి. ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా ప్రజలు మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ తీవ్రతను తగ్గించవచ్చు.
జాగ్రత్తలు అవసరం
కొవిడ్ వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్ వాడకం, భౌతికదూరం పాటించాలి.
ప్రధానంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ రక్షణ కవచంగా పని చేస్తున్నది.
నిబంధనలు పాటించాలి..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ పాటించాలి. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు నుంచి బయట పడొచ్చు. తమకేం కాదనే నిర్లక్ష్యాన్ని విడనాడాలి. ఒమిక్రాన్ వేరియంట్ రాష్ట్రంలోనూ వెలుగు చూసిన నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మాస్కుల వాడకం, భౌతికదూరం తప్పనిసరి.