ఎల్లారెడ్డి రూరల్/పిట్లం /నిజాంసాగర్, డిసెంబర్ 1 : అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అమానుషమని ఆ శాఖ అధికారులు అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజీపేట్ తండా శివారులో నవంబర్ 29న రాత్రి బీట్ అధికారులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. నిరసనగా బుధవారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై పోలీస్‌శాఖ అధికారులతో కలిసి అటవీశాఖ అధికారులు, సిబ్బంది భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎస్సై-2 మధుసూదన్‌రెడ్డి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిట్లంలో డిఫ్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థ ఆధ్వర్యంలో బీట్ అధికారులు, పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. జుక్కల్‌లో అటవీశాఖ, పోలీసు శాఖ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఎఫ్ఆర్వో రమేశ్, జుక్కల్ ఎస్సై శ్రీనివాస్‌యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.