Nitin Gadkari | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సమయంలో ఇరాన్లో హమాస్ అధినేత (Hamas leader) ఇస్మాయిల్ హనియా (Ismail Haniyeh) హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని హత్య వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే, హనియా హత్య జరిగి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ నేపథ్యంలో నాటి సంఘటనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తాజాగా గుర్తు చేసుకున్నారు. హత్యకు కొన్ని గంటల ముందు హనియాను తాను కలిసినట్లు వెల్లడించారు.
ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. గతేడాది జులైలో తాను ఇరాన్ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరఫున హాజరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టెహ్రాన్ (Tehran)లో ఫైవ్‌స్టార్ హోటల్లో తమకు బస ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచ నాయకులు, ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. అయితే, ఎలాంటి పదవి లేకపోయినా హమాస్ చీఫ్ హనియా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు వివరించారు.
‘వివిధ దేశాధిపతులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఏ దేశానికి అధిపతి కాని ఓ వ్యక్తి కూడా వచ్చారు. అతనే హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా. నేను ఆయన్ను కలిశాను. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాన న్యాయమూర్తితో కలిసి వెళుతుండగా చూశాను. ఇక కార్యక్రమం ముగించుకొని హోటల్‌కు చేరుకున్నాము. మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భారత్‌లోని ఇరాన్ రాయబారి నా వద్దకు వచ్చి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. ఏం జరిగింది అని నేను అడిగా. హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారని చెప్పారు. ఆ మాట విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎలా జరిగిందని అడగ్గా.. ఇంకా వివరాలు తెలియదని చెప్పారు’ అని నాటి సంఘటనను గడ్కరీ గుర్తు చేసుకున్నారు.
గతేడాది జులైలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగింది.
హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్ గ్రూపులో చేరగా.. 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా.. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. 2017లో హమాస్ చీఫ్‌గా ఎన్నికైన హనియాను.. అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడి ఖతార్‌లో నివాసం ఉంటున్నాడు.
Also Read..
Indian Vlogger | భారత వ్లాగర్‌ను నిర్బంధించిన చైనా
Attack on cars | ఇంటిముందు పార్కింగ్ చేసిన కార్లను ధ్వంసం చేసిన దుండగులు
Raw Onions | పచ్చి ఉల్లిపాయలను రోజూ ఆహారంలో భాగంగా తింటే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!