Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, మొదట కొంతమంది నుంచి మిశ్రమ స్పందన ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు రికార్డు స్థాయి వసూళ్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతుండటంతో ‘ధురంధర్’ 2025లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ఈ మూవీ ఇప్పటివరకు కేవలం హిందీ భాషలోనే విడుదలైనప్పటికీ, హిందీ వెర్షన్ నుంచే బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సౌత్‌లోనూ హిందీ వెర్షన్‌కి మంచి వసూళ్లు రావడం విశేషంగా మారింది.
ఇటీవల కాలంలో ‘బ్రహ్మాస్త్ర’, ‘పఠాన్’ వంటి కొన్ని హిందీ చిత్రాలు ఉత్తర భారతదేశంలో సూపర్ హిట్ అయినప్పటికీ, దక్షిణాదిలో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే ‘ధురంధర్’ మాత్రం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ పాన్ ఇండియా రేంజ్లో మంచి ఆదరణ పొందుతోంది. ఇదే కారణంగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ధురంధర్’ సినిమాను త్వరలోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల సినిమా మరింత విస్తృత ప్రేక్షకుల వరకు చేరుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటికే ప్రకటించిన సీక్వెల్ ‘ధురంధర్ 2’ ను కూడా దక్షిణ భారత భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సీక్వెల్ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, కథనంతో పాటు ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. రణ్వీర్తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి టాప్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన ‘నాన్న’ మూవీ ఫేమ్ సారా అర్జున్ కథానాయికగా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి దర్శకుడు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ధురంధర్’ స్పై యాక్షన్ జానర్లో బాలీవుడ్‌కు మరో భారీ విజయంగా నిలుస్తోంది. పాన్ ఇండియా డబ్బింగ్ రిలీజ్‌తో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయనుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.