నిర్మల్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవి, గాయకుడు, నటుడు, సమాజ సేవకుడు, ఆధ్యాత్మిక వేత్త, పురాణ ప్రవచనకర్తగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరించిన మడిపెల్లి భద్రయ్య అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నిర్మల్ పట్టణంలోని సోమవార్పేట్కు చెందిన భద్రయ్య జనవరి 17న 1945లో జన్మించారు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో ఉన్నత విద్యను అభ్యసించారు. 1963లో లక్షెట్టిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని భైంసా, దిలావర్పూర్, ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసి, 2001లో కుంటాల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేశారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే మరో వైపు సాహిత్య, సాంస్కృతిక చైతన్యానికి కృషి చేశారు. జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర పద్యకవితా సదస్సు, నర్సాపూర్‌లో నవతాకళా సమితి మొదలగు సాహితీ సంస్థలను స్థాపించారు. ఇచ్చోడలో పని చేస్తున్నప్పుడు ‘ప్రత్యూష’ అనే లిఖిత సాహిత్య పత్రికను నడిపారు. అంతేకాకుండా సత్యహరిశ్చద్ర, గయోపాఖ్యానము వంటి పౌరాణిక నాటకాలతో పాటు నటనాలయం, రాముడు లేని రాజ్యంలో వంటి సాంఘిక నాటికాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. టీవీలో ప్రసారమైన నాగబాల, చాకలి ఐలమ్మ, కుమ్రం భీం వంటి సీరియళ్లలో కూడా నటించారు. అలాగే మలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన ఆటాపాటలతో ఎందరికో స్ఫూర్తి నింపారు. ఇలా పలు రంగాల్లో విశేష సేవలందించిన మడిపెల్లి భద్రయ్య గతేడాది సెప్టెంబర్ 18న శివైక్యం పొందారు. అదే నెలలో పెన్షనర్ల సంఘ భవనంలో జరిగిన శ్రద్ధాంజలి సభలో కవులు, కళాకారులతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నిర్మల్‌లో మడిపెల్లి భద్రయ్య విగ్రహాన్ని పెట్టాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కోరారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్‌కు సూచించారు. దీంతో ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున శాస్త్రీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న భద్రయ్య విగ్రహాన్ని అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
మడిపెల్లి భద్రయ్య ఆధ్యాత్మిక రచనలు, గేయాలు, ఒగ్గు, హరికథలు ఇలా అనేక పుస్తకాలు రచించారు. వీటిలో శ్రీ షిర్డీసాయి త్రిశతి, శ్రీ జ్ఞాన సరస్వతీస్తవం, శ్రీ షిరిడీసాయి భజనావళి, శ్రీ మెహర్ భక్తి గీతావళి, శ్రీ సత్యసాయిస్తుతి, నాలోని నాదాలు, శ్రీ శివభక్త చరితం (పద్యకావ్యం), మనోవేదన (పద్య సప్తశతి), మన ఆదిలాబాద్ (జిల్లా సమగ్ర దర్శిని), శ్రీహరి లీలలు (పద్యకావ్యం) మొదలగు రచనలు ఉన్నాయి. వీటితోపాటు నిరసన గొంతుకలు (తెలంగాణ ఉద్యమ పాటలు-పద్యాలు), శ్రీ ప్రభాకర్ మహారాజ్ స్మృతిలో (సంక్షిప్త జీవిత చరిత్ర), శ్రీ శివలీలలు, శ్రీ షిర్డీ సాయి చరితమ్ (హరికథా రూపకం), కర్తవ్యం(కవితలు), మనోవిలాసం (ద్విశతి), శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహ శతకము, చాచా నెహ్రూ (ఆకాశవాణి రూపకం), నిర్మల్ చరిత్ర (ఒగ్గు కథ) తదితర పుస్తకాలు ఎంతో ప్రాచూర్యం పొందాయి.
ఇటు ఉపాధ్యాయ రంగానికి, అటు సాహితీ రంగానికి మడిపెల్లి భద్రయ్య చేసిన సేవలకు గాను ఆయనకు అనేక పురస్కారాలు, బిరుదులు దక్కాయి. 1983లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు, 1988లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు, 1997లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కాయి. అలాగే 1997లో కళాభారతి, చంద్రాపూర్ వారితో సన్మానం, 2010లో అభినవ పోతన వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం, 2011లో తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, 2014లో ఎంవీ నరసింహరెడ్డి సాహితీ పురస్కారం, 2015లో ముళ్లపూడి సూర్యనారాయణమూర్తి స్మారక జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే 2015లో రాష్ట్ర అవతరణ ప్రథమ వార్షికోత్సవాల్లో జిల్లా ఉత్తమ సాహితీవేత్తగా పురస్కారం, 2015లోనే బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రముఖ సాహితీవేత్తగా పురస్కారం, ఇదే ఏడాది రంజని తెలుగు సాహితీ సంస్థ వారి పద్యకవితా పోటీల్లో విశ్వనాథ అవార్డు, భారత కల్చరల్ అకాడమీ వారి కళాశిరోమణి అవార్డులను అందుకున్నారు. వీటితో పాటు విశిష్ట కళారత్న, కళాజ్యోతి, సాహిత్యరత్న బిరుదులను భద్రయ్య అందుకున్నారు.