
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేందుకు అమలుచేస్తున్న నిపుణ్భారత్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేయడంపై కేంద్రవిద్యాశాఖ ప్రశంసలు కురిపించింది. ఈ పథకంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన 4వ ప్రాంతీయ వర్క్‌షాప్‌లో తెలంగాణ చర్యలను కేంద్రం అభినందించింది. 2025 నాటికి పిల్లలందరికీ చదవడం, రాయడం నేర్పించేలా శిక్షణనిచ్చే ఈ కార్యక్రమ వర్క్‌షాప్‌నకు తెలంగాణ నుంచి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, మెదక్ డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్‌బాబు, ప్రధానోపాధ్యాయుడు సువర్ణ వినాయక్, సమగ్రశిక్షణ కోఆర్డినేటర్ ఎస్కే తాజ్‌బాబు, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పిల్లలు నష్టపోకుండా తీసుకున్న చర్యలను తెలంగాణ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్క్షీట్లు, బోధనాభ్యసన మాడ్యూల్స్, బ్రిడ్జికోర్సుల రూపకల్పన, స్టడీ మెటీరియల్ వంటివి తయారుచేయడంతోపాటు రాబోయే 5 ఏండ్ల ప్రణాళికను వివరించారు. వీటిని పరిశీలించిన కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలంగాణ విధానాలను కొనియాడారు.