న్యూఢిల్లీ : నేషనల్ హైవేలపై పరిశుభ్రతను పెంచేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించి రిపోర్టు చేసిన వారికి రూ. 1000 నజరానా ప్రకటించింది. మురికిగా ఉన్న టాయిలెట్‌ను ఫొటో తీసి ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ మొబైల్ యాప్‌లో షేర్ చేస్తే మీ ఫాస్టాగ్‌లో నేరుగా రూ. 1000 జమ అవుతాయి. క్లీన్లీనెస్ డ్రైవ్‌లో భాగంగా ఎన్హెచ్ఏఐ ఈ స్కీంను తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా యూజర్లు షేర్ చేసే విలువైన ప్రతి ఫొటోకు రూ. 1000 సంపాదించుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం యూజర్లు రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఫొటోను స్పష్టంగా, జియోట్యాగ్‌తో సమయం కనబడేలా తీయాలి. అలాగే, యూజర్ నంబర్, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (వీఆర్ఎన్), మొబైల్ నంబర్‌ను కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ టాయిలెట్లు ఎన్ఏహెచ్ఐ నిర్మించినవి కానీ, నిర్వహిస్తున్నవి కానీ అయి ఉండాలి. యూజర్ పంపిన ఫొటోను నిర్ధారించుకున్న తర్వాత అతడి ఫాస్టాగ్ ఖాతాలో రూ. 1000 జమ అవుతాయి. అయితే, ఈ రివార్డు నగదు రూపంలో విత్‌డ్రా చేయడానికి కుదరదు.