మొన్నటి వరకూ రోజుకో తేదీని, ముప్పై రోజులకు ఒక నెలను.. మొత్తంగా మూడువందల అరవై అయిదు రోజుల గిఫ్ట్‌ప్యాక్‌ను అందించిన 2021 సంవత్సరానికి మానవజాతి రుణపడి ఉండాలి. ఎందుకంటే, ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కోలా ప్రభావితం చేసింది. సమాజాన్ని ఓ సంక్షోభం నుంచి ఒడుపుగా ఒడ్డుకు చేర్చిన పాత ఏడాదికి ఎన్నిసార్లు ‘థ్యాంక్స్’ చెప్పినా రుణం తీరదు. నేర్చుకునే మనసుంటే, ఆ అనుభవాలన్నీ జీవితాన్ని రాటుదేల్చే పాఠాలే.
ఆరోగ్య రాయబారి
మనిషికి ఆరోగ్యం మీద మునుపెన్నడూ లేనంత శ్రద్ధ పెరిగింది.దేశంలో కాయగూరల వినియోగం, పాల వాడకం పెరిగింది. ఆరోగ్యకర ఉత్పత్తులకు గిరాకీ రెట్టింపైంది. మద్యం, ధూమపానం విక్రయాలు తగ్గలేదు. అలా అని పెరగనూ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా టీకాకు అధికారికంగా ఆమోదం తెలిపింది.
పర్యావరణ ప్రేమి
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గింది. దాదాపు ఎనభై దేశాలు శాశ్వతంగా బహిష్కరిస్తూ ఆదేశాలు జారీచేశాయి. సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. విద్యుత్ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రకృతికి కోపం వస్తే.. ఎంత వికృతంగా ప్రవర్తిస్తుందో మనిషికి అర్థమైపోయింది.
అంతరించి పోయాయని అనుకున్న వన్యజీవులూ అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
మార్పు తీర్పరి
ఏ వికాస గ్రంథాలూ సాధించలేని విజయం.. కాలచక్రంలో ఓ చిన్నభాగమైన సంవత్సరానికి సాధ్యమైంది. మనిషికి తన పరిమితులు అర్థం అవుతున్నాయి…‘వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే’ అన్న క్షణభంగుర తత్వం ఒంటబట్టింది. దీంతో, నలుగురితో ఎంతోకొంత పంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. క్రౌడ్ ఫండింగ్ నిధులు, ఎన్జీవోల విరాళాలు గతంతో పోలిస్తే పెరిగినట్టు తెలుస్తున్నది.
మనసున్న ఏడాది
కరోనా భయంతో వణికిపోతున్న జనానికి ఊరటనిచ్చింది. వ్యాక్సిన్లను సామాన్యుల వరకూ తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా సగానికి సగం మందికి టీకాలు ఇచ్చింది.ఒమిక్రాన్‌ను లెక్కచేయని మనో ధైర్యాన్నీ ప్రసాదించింది.
ఐడియా బ్యాంక్
అవసరం అమ్మలాంటిదని అంటారు. అవసరంలో నుంచే ఆలోచనలు, ఆవిష్కరణలు పుడతాయి. ఆంత్రప్రెన్యూర్లు ఆవిర్భవిస్తారు. కేవలం కొవిడ్‌కు పరిష్కారంగానే భారత్‌లో ఓ వంద అంకుర సంస్థలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు, గత ఏడాది నలభైరెండు భారతీయ స్టార్టప్స్ వందకోట్ల
కంపెనీలుగా అవతరించాయి.
స్త్రీజన పక్షపాతి!
భారతీయ మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యింది, విశ్వసుందరి కిరీటాన్ని ధరించింది.మరిన్ని బహుళజాతి సంస్థల పగ్గాలు అందుకున్నది.అన్నీ మంచి శకునములే!
బహు చమత్కారి
గత ఏడాదిని ‘చమత్కారనామ సంవత్సరం’ అనీ పిలవాలి.కత్రినా కైఫ్ అనే అందాల బొమ్మను విక్కీ కౌశల్ అనే లక్కీ బాయ్తోముడిపెట్టి.. ముదురు బ్రహ్మచారులు అసూయతో రగిలిపోయేలా చేసింది. జపాన్ రాకుమారి ఏరికోరి ఓ సామాన్యుడిని ఎంచుకొనేలా కనికట్టు చేసింది.