‘క్యాబ్స్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలి. ప్రయాణికులు అడిగిన చోటుకు తీసుకెళ్లాలి. నిరాకరిస్తే రూ. 500 విధిస్తాం. ఎవరైనా అలా చేస్తే.. ఆ వాహన నంబర్ సూచిస్తూ..9490617346కు సమాచారం ఇవ్వాలి. ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఎక్కువగా చార్జీలు వసూలు చేయవద్దు’ అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను ఇన్సిండెట్ ఫ్రీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, రాత్రి వేళై ఫ్ల్లెఓవర్లను మూసివేయనున్నారు. తాగి బండి నడిపే వారి భరతం పట్టనున్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎన్టీఆర్మార్గ్, పీవీ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం రాత్రి 10 నుంచి 1వ తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. బేగంపేట్ పైవంతెన మినహా నగరంలోని మిగతా ఫ్లై ఓవర్లన్నీ నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మూసివేస్తున్నట్లు సీపీ తెలిపారు. 1వ తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదన్నారు.
ఖైరతాబాద్ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్మార్గ్ వైపునకు వాహనాలకు అనుమతి ఉండదు.. రాజ్‌భవన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వెహికిల్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్ మినార్ వైపు నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లాలి.ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చేవి ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్, లక్డీకాపూల్ వైపు వెళ్లాలి.మింట్ కంపౌండ్ నుంచి సచివాలయం వెళ్లే లైన్లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను కర్బాల మైదాన్, మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ క్రాస్‌రోడ్డుకు పంపిస్తారు.
సైబరాబాద్‌లో ఫ్లై ఓవర్ల మూసివేత
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా 31వ తేదీ రాత్రి సైబరాబాద్ పరిధిలో పలు ఫ్లైఓవర్లు, రోడ్లు మూసి వేసి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపైకి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వాహనాలకు అనుమతి లేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. కేవలం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
సైబర్ టవర్స్ , గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరం మాల్ – జేఎన్టీయూ, రోడ్డు నం. 45 ఫ్లై ఓవర్లు , దుర్గం చెరువు బ్రిడ్జి, బాబూ జగ్జీవన్‌రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్) రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసేస్తారు.
పబ్స్, బార్ల నిర్వాహకులు తమ వద్దకు వచ్చే కస్టమర్లను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని డీసీపీ సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతంగా ఉంటుందని, తాగి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బార్, పబ్ యజమానులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో సమీక్ష నిర్వహించారు. బార్, పబ్ నిర్వాహకులను పిలిపించి… పాటించాల్సిన నిబంధనలను వివరించారు. 31వ తేదీ రాత్రి అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.