సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వేడుకల్లో ‘మత్తు’కు చోటులేకుండా చేసేందుకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారు. న్యూఇయర్ సమీపిస్తుండడంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే డ్రగ్స్ విక్రేతలపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉన్నా, ఇతర రాష్ర్టాలకు చెందిన స్మగ్లరకు ఇదే అదునైన సమయంగా భావించి..మెట్రో పాలిటన్ సిటీలపై దృష్టి పెడుతుంటారు. దీంతో వారు నగరంలో తిరుగకుండా చేసేందుకు ఎక్సైజ్ సిబ్బంది పటిష్టమైన నిఘాను కొనసాగిస్తున్నారు. మరోవైపు నగర పోలీసులు కూడా మత్తు పదార్థాలు అమ్మే వారిని ఎక్కడికక్కడే కట్టడి చేశారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చేందుకు పోలీసులు, ఎక్సైజ్ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే గంజాయిపై ఉక్కుపాదం మోపారు. గాంజా జాడలు లేకుండా చేసేందుకు పాత నేరస్తులపై ఇప్పటికే నిఘాను కొనసాగించి, నేర ప్రవృత్తిని మానుకోని వారిపై పీడీయాక్ట్‌లు పెట్టారు. ఏపీ, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు అనువైన సమయం భావించే పాత నేరస్తులు తమ పాత వినియోగదారులను సంప్రదించే అవకాశాలున్నాయి.
బహిరంగ వేడుకలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. దీంతో యువత తమ స్నేహితులతో కలిసి ఇండ్లలోనే న్యూఇయర్ సంబురాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఐదారు మంది ఒక చోట కలిశారంటే.. కొందరు ఎంజాయ్ మూడ్ కోసం డ్రగ్స్ తీసుకునే అవకాశాలుంటాయి. ఇలాంటి వాటిని ముందే ఊహించిన ఎక్సైజ్ పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. 24 గంటలు రూట్ వాచ్ చేస్తున్నాయి. పాత నిందితుల కదలికలపై నిఘా పెట్టి, వాళ్లు ఎవరెవరిని కలుస్తున్నారు? గ్యాంగ్ సభ్యులు ఎవరు అనే విషయాలను విశ్లేషిస్తున్నారు.
గతంలో డ్రగ్స్ విక్రయించి పట్టుబడ్డ వారు, వారి అనుచరులు, ఇతర ప్రధాన సిటీల నుంచి నగరానికి వచ్చే అనుమానితులపై నిఘా పెట్టాం. కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలున్నా, నిబంధనల మేరకు జరుపుకొనే సంబురాలపై కూడా నిఘా కొనసాగుతుంది. నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహించుకునే వారు డ్రగ్స్ మహమ్మారి జోలికి వెళ్లకుండా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి. – అంజిరెడ్డి, హైదరాబాద్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్