కొవిడ్ మహమ్మారి మనిషి వ్యక్తిగత జీవితాలను సమూలంగా మార్చేసింది. ఉద్యోగుల వృత్తిపరమైన జీవితాల్లో గణనీయమైన మార్పులు తేవడంతో పాటు వారి అభిరుచులను కూడా మార్చింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించింది. ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో ఈ విధానం కొనసాగుతుండగా, కొన్నింటిలో హైబ్రిడ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. కరోనా ఐటీ ఇండ్రస్టీలో ‘డ్యూయల్ ఎంప్లాయిమెంట్’, మొత్తంగా కార్పొరేట్ ఇండస్ట్రీలో ‘క్వైట్ క్విట్టింగ్’ అనే నయా ట్రెండ్లను సృష్టించింది. ఇది ఆయా పరిశ్రమలను ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో అసలు డ్యూయల్ ఎంప్లాయిమెంట్, క్వైట్ క్విట్టింగ్ అంటే ఏంటో చూద్దాం..
ఐటీ ఉద్యోగులు, నిపుణులు ఒకే సమయంలో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడాన్ని యాజమాన్యాలు ‘మూన్‌లైటింగ్’గా పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో బాగా చర్చ నడుస్తున్నది. కొవిడ్ నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ కొత్త ట్రెండ్ ముందుకు వచ్చింది. కరోనా ప్రభావంతో రెండేండ్లకు పైగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డ్యూయల్ ఎంప్లాయిమెంట్ అనే కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు.
డిమాండ్ నేపథ్యంలో పలు కంపెనీల ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ రెండు ఉద్యోగాలు.. కొంత మంది అయితే ప్రాక్సీల సాయంతో అంతకంటే ఎక్కువగా కూడా చేస్తున్నారు. దీనికి కారణం అవకాశం ఉన్న ఈ కొద్ది సమయంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించడం. కంపెనీలు ఆఫీసుకు వచ్చి వర్క్ చేయాలని ఆదేశాలు వస్తే.. ఇక ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేసే అవకాశం ఉందనే ఆలోచనతో అనేక మంది ఐటీ ఉద్యోగులు ఈ కొత్త ట్రెండ్ బాటపట్టారు. పనిభారం అయినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒత్తిడిని తట్టుకొని మరీ బహుళ ఉద్యోగాలు చేస్తున్నారు.
‘మూన్‌లైటింగ్’ ట్రెండ్‌పై కంపెనీల ఆందోళన
‘మూన్‌లైటింగ్’ ట్రెండ్‌పై ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా తాజాగా వ్యాఖ్యానించారు. రెండు ఉద్యోగాలు చేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుందని, ఇదే సమయంలో ఇటువంటి ఉద్యోగుల ద్వారా తమ కంపెనీకి సంబంధించిన డాటా ఇతర ప్రత్యర్థి కంపెనీల(ఆ కంపెనీలకు కూడా పనిచేస్తుంటారు కాబట్టి)కు తెలిసే అవకాశం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. డ్యూయల్ ఎంప్లాయిమెంట్ విధానం పాశ్చాత్య దేశాల్లో అధికంగా ఉన్నది.
క్వైట్ క్విట్టింగ్ అంటే..
కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వృత్తిపరమైన అభిరుచులు కూడా మార్చుకుంటున్నారు. ఉద్యోగాలు మారడమే కాదు.. పనిభారం తగ్గించుకునే ఆలోచన చేస్తున్నారు. దీనినే ‘క్వైట్ కిట్టింగ్’గా పేర్కొంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో, సోషల్ మీడియాలో దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఈ పోకడ తక్కువగానే ఉన్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. క్వైట్ క్విట్టింగ్ అంటే పనిభారం తగ్గించుకొని, కేవలం వారి పాత్రకు మాత్రమే పరిమితం కావడం. ముఖ్యంగా కొవిడ్ తర్వాత వ్యక్తిగత, వ్యత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో భాగంగా ఉద్యోగులు దీన్ని అనుసరిస్తున్నారని పలు అధ్యయనాలు అభిప్రాయపడుతున్నాయి.
ఒకప్పుడు ఉద్యోగమే జీవితం అన్నట్టుగా పనిచేసేవారు.. ఇప్పుడు దానికి స్వస్తి పలుకుతున్నారు. అదనపు బాధ్యతలను భుజాన వేసుకోవడానికి కార్పొరేట్ ఉద్యోగులు ఇష్టపడటం లేదని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఉద్యోగంలో అసంతృప్తి, తక్కువ వేతనాలు, సరైన గుర్తింపు లేకపోవడం, మెరుగైన భవిష్యత్తు అవకాశాలలేమి, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఆలోచన వంటికి క్వైట్ కిట్టింగ్కు ప్రధాన కారణాలని ఉద్యోగులు పలు సర్వేల్లో వెల్లడించారు.