సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): జనన ధ్రువపత్రం పొందడం మరింత సులభతరం కానున్నది. ఇక మీదట ఎటువంటి దరఖాస్తు చేయకుండానే జనన ధ్రువపత్రాన్ని మంజూరు చేసే విధానాన్ని జీహెచ్ఎంసీ త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దవాఖానలో పుట్టిన శిశువుల వివరాలను వైద్యులు ధ్రువీకరించి సంబంధిత సర్కిల్ కార్యాలయానికి చేరవేస్తే జీహెచ్ఎంసీ ఆమోదిస్తుంది. ధ్రువపత్రం మంజూరైనట్లు తల్లిదండ్రులకు వచ్చిన ఎస్ఎంఎస్లోని నంబరు చూపించి రాష్ట్రంలోని నలమూలల ఉన్న మీ సేవ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ మేరకు పారదర్శకంగా ఉండేలా 30 సర్కిళ్లకు 30 ఈ-ఆఫీస్ లాగిన్లు ఇచ్చి ప్రత్యేకంగా రిజిస్ట్రార్లను (ఏఎంఓహెచ్), సబ్ రిజిస్ట్రార్లను (ఏఎంసీ) నియమించారు.
60 రోజులు దాటితే.. అధికారిపై వేటు
జన్మించిన, మరణించిన తేదీ నుంచి నెలలోపు వచ్చే ఆర్జీలకు ఏఎంసీల బాధ్యత ఉండగా, ఏడాదిలోపు వచ్చే వాటిని ఏఎంఓహెచ్ఓలు ఆమోదిస్తారు. కాగా దవాఖానలు ధ్రువీకరించిన జనన, మరణాలను అధికారులు ఆమోదించారా? లేదా? అనే విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్, అదనపు కమిషనర్ తెలుసుకుంటారు. వారం, పదిహేను, నెల, రెండు నెలల పాటు ఆమోదానికి నోచుకోకపోతే వివరణ కోరతారు. 60 రోజులు దాటితే సదరు అధికారిపై వేటు వేయనున్నారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించిన అధికారులు ప్రస్తుతం పాత, కొత్త విధానాన్ని అమలు చేస్తుండగా, ఈ నెలాఖరులోగా పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇంటివద్ద జరిగితే పాత పద్ధతిలోనే..
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లు ఉండగా ధ్రువపత్రాల జారీ 18 సర్కిళ్ల పేరుతో మాత్రమే జరుగుతున్నది. పాత సాఫ్ట్వేర్ను వాడుతుండటంతో ధ్రువపత్రాల జారీ క్లిష్టంగా మారి అవినీతికి అస్కారం ఏర్పడుతున్నది. ఇక్కడే సంస్కరణలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. పౌరులు దరఖాస్తు చేసే వరకు ఆగకుండా, వైద్యులు ఇచ్చిన జనన, మరణాల వివరాలను నేరుగా ఆమోదించి ధ్రువపత్రాలు మంజూరు చేయబోతున్నామని అధికారులు తెలిపారు. ఇంటి దగ్గర, ఇతర ప్రాంతాల్లో జరిగిన జనన, మరణాల నమోదు ప్రస్తుతం మాదిరిగానే క్షేత్రస్థాయి విచారణ ఆధారంగా జరగనుందన్నారు.