CUET | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : జాతీయంగా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో మరిన్ని మార్పులు చేస్తూ యూజీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. చాయిస్ ప్రశ్నలను తొలగించింది. దీంతో ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందే. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను యూజీసీ బుధవారం విడుదల చేసింది.
13 భాషల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనుండగా, ఎస్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా ప్రశ్నలివ్ననున్నారు. సీయూఈటీ -యూజీలో అంత్రప్రెన్యూర్షిప్, టీచింగ్ ఆప్టిట్యూడ్, ఫ్యాషన్ స్టడీస్, టూరిజం, లీగల్ స్టడీస్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్ వంటి సబ్జెక్టులను ఉపసంహరించారు. కాగా, మంగళవారం కొన్ని మార్పులను ప్రకటించిన యూజీసీ తాజాగా బుధవారం మొత్తం మార్పులను మీడియాకు విడుదల చేసింది.