సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) :ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిబంధనల పేరిట బాదుడుకు సర్కార్ సిద్ధమైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చిన క్యూర్ చట్టం ప్రకారం మున్సిపల్ వ్యవహారాల్లో చట్టపరమైన నిబంధనలు, బాధ్యతలు, తదితర ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు, ప్లాస్టిక్ నిషేధం, నాలాలపై కబ్జాల నియంత్రణలో పూర్తిస్థాయిలో చట్టం అమలు కావడం లేదు.
ఇక మీదట ఈ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధించేలా స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేశారు. చట్ట నిబంధనలను మొదటిసారి ఉల్లంఘించిన వ్యక్తులకు రూ.10వేల జరిమానా విధిస్తారు. అదే కంపెనీలు, సంస్థలు, ట్రస్ట్‌లు, సొసైటీలు లేదా కార్పొరేట్ బాడీలు ఈ ఉల్లంఘనకు పాల్పడితే రూ.50వేల వరకు పెనాల్టీ చెల్లించనున్నారు. ఒకసారి జరిమానా పడిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తి లేదా సంస్థ మళ్లీ ఆదేశాలు, నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ రెట్టింపు కానుంది.
వ్యక్తిగత ఉల్లంఘనలకు రూ. 20వేలు, కంపెనీలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు రూ.లక్ష వరకు పెనాల్టీలు విధిస్తారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంశంలో ప్రతిరోజూ జరిమానా ఉల్లంఘన కొనసాగితే చట్టబద్ధమైన నిబంధనలను పాటించాలని కోరుతూ అధికారులు నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనను సరిదిద్దుకోకుంటే, ఆ తప్పును సరిచేసే వరకు ప్రతి రోజూ అదనపు జరిమానా (డే-టు-డే పెనాల్టీ) విధిస్తామని నూతన చట్టం స్పష్టం చేస్తోంది. త్వరలోనే ఈ యాక్ట్‌ను పూర్తి స్థాయిలో ఆమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.