భీమ్‌గల్, జూలై 26 : కక్షిదారులకు చట్టపరిధిలోనే సరైన న్యాయం అందుతున్నదనే భరోసా కల్పించాలని హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తంగిరాల మాధవీదేవి జడ్జిలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
కొత్త కోర్టుల ఏర్పాటు అంటే కేవలం భవనాలను ప్రారంభించడం కాదని, ఆర్టికల్ 39 ఏ ప్రకారం పౌరులందరికీ సమాన న్యాయంతో పాటు ఉచితంగా చట్టపరమైన సేవలు అందించే రాజ్యాంగబద్ధ బాధ్యతను పునరుద్ధరించడమేనని పేర్కొన్నారు. నూతన కోర్టులో జడ్జికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం లింబాద్రి గుట్టకు చేరుకొని నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి పాల్గొన్నారు.