Maharashtra | ముంబై, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. దీనికి డిసెంబర్ 4న ముగింపు పలుకుతున్నట్టు బీజేపీ వర్గాలు సోమవారం ప్రకటించాయి. బుధవారం విధాన్ భవన్లో బీజేపీ శాసనసభ పక్షం ‘కొత్త’ నాయకుడ్ని ఎన్నుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ అధిష్టానం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, గుజరాత్ మాజీ సీఎం రూపానీలను పరిశీలకులుగా పంపింది. సమావేశం అనంతరం పార్టీ శాసనసభ నాయకుడి పేరును పరిశీలకులు అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, సీఎం పదవికి ఫడ్నవీస్ పేరును బీజేపీ ఖరారు చేసిందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు సోమవారం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. ఫడ్నవీస్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారని తెలిసింది. ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే లేకుండా అమిత్ షా ఈ సమావేశం నిర్వహించటం గమనార్హం. వాస్తవానికి సోమవారం మహాయుతి కూటమి సమావేశమై, కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్య కారణాలతో షిండే అందుబాటులో లేకపోవడంతో రద్దయింది.
గురువారం సాయంత్ర 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగే కొత్త సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నాయకులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. మరోవైపు మహాయుతి కూటమిలో ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే వ్యక్తం చేస్తున్న మాటలు సంచలనం రేపుతున్నాయి. రెండోసారి సీఎంగా కొనసాగించటం లేదంటూ ఆయన కినుకు వహించారు. దీంతో ఆయన తీరుపై బీజేపీ అధిష్టానం కొంత కలవరపాటుకు గురవుతున్నది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘నేను సామాన్యుల కోసం పని చేస్తున్నా. నేను ప్రజల ముఖ్యమంత్రిని. అందుకే నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ షిండే వాపోయారు.