మానవత్వపు కథలు

ప్రతీ కథకు మానవత్వపు పరిమళాన్ని అద్దుతూ ఎమ్.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి వెలువరించిన సంపుటి ‘ఋణం’ కథలు. సాధారణంగా అద్దెగర్భం (సరోగసీ) అంటే కాసులతో కూడిన స్వార్థమే కనిపిస్తుంది. అలా కాకుండా సరోగసీ ఇతివృత్తంతో ‘పేగుబంధం’ కథను రచయిత మానవత్వానికి పెద్దపీట వేస్తూ నడిపించడం విశేషం. ఇక పుస్తక శీర్షికగా ఎంచుకున్న ‘ఋణం’ కథ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డవాళ్ల సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుంది. పుట్టినగడ్డపై, అక్కడి మనుషులపై మమకారం పెంచుకుని జీవితం సాగించిన అత్తరు సాయిబు వ్యక్తిత్వాన్ని కళ్లకు కట్టే కథ ‘పరిమళం’. సాదాసీదాగా మొదలై, చెట్టుకింద వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి పట్ల అయిష్టతను పెంచేదిగా సాగిపోయి, చివరికి ఆ వ్యాపారి మానవత్వాన్ని చాటేది ‘చెట్టుకింద మనిషి’. ఇది ఊహించని ముగింపుతో నడిచే కథ. వీధిలో పిల్లలను ప్రోత్సహించే, అవసరంలో ఉన్నవారికి సాయంగా నేను ఉన్నానంటూ చేయందించే మంచితనం మూర్తీభవించిన మామ్మ కథ ‘చిట్టిమామ్మగారి అరుగు’, తమ గురువు మమకారం పెంచుకుని, అనుకోని పరిస్థితుల్లో అమ్మిన ఇంటిని మళ్లీ ఆయనకే దక్కేలా చేసిన శిష్యుల కథ ‘గురుదక్షిణ’, తండ్రి మిగిల్చి వెళ్లిన సైకిల్ను ప్రాణప్రదంగా చూసుకునే కొడుకును చిత్రించిన ‘నాన్న సైకిల్’, మనకు ఎదురయ్యే వ్యక్తులతో ఎంత అపురూపంగా మసలుకోవాలో హృద్యంగా చిత్రించిన ‘బహుదూరపు బాటసారి’… ఇలా ఈ సంపుటిలోని 19 కథలూ మానవత్వపు పరిమళాలను వెదజల్లుతూ సాగిపోయేవే.
ఋణం కథలు
పేజీలు: 162; వెల: 150
రచన: ఎమ్.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి
ప్రచురణ: రమ్య గాయత్రి ప్రచురణలు
ప్రతులకు: ఎం.రాజేశ్వరి, ఫోన్: 9848663735
మోక్షపురికి మార్గదర్శి

కాశి..భారతీయుల అతి పురాతన ఆధ్యాత్మిక నగరం. కాశి అంటే విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, గంగానది, దానికే ప్రత్యేకమైన మోక్షపురి అన్న పేరూ గుర్తుకువస్తాయి. గంగా నదిని అనుసరించి కట్టిన ఘాట్లు, అంబరాన్ని చుంబిస్తున్నట్లుగా ఉండే ఆలయాల శిఖరాలు కళ్లముందు నిలుస్తాయి. షెహ్నాయ్ విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ వాద్య మధురిమ, మదన్ మోహన్ మాలవీయ స్థాపించిన సుప్రసిద్ధ కాశీ హిందూ విశ్వవిద్యాలయ అక్షర సేవ స్ఫురణకు వస్తాయి. ఇంతేనా! కాశీ అంటే కాలభైరవుడు, ఢుండి గణపతి, తులసీదాస్ జీవితంతో ముడిపడిన సంకట మోచన్ హనుమాన్ దేవాలయం, జ్ఞానవాపీ బావి, మణికర్ణిక, దశాశ్వమేథ, హరిశ్చంద్ర ఘాట్లు, బెనారస్ పట్టుచీరలు. ఈ విశేషాలతోపాటు బయటివారికి అంతగా తెలియని ద్వాదశాదిత్యులు, గవ్వలమ్మ గుడి, ఆ నగరానికే ప్రత్యేకమైన ఆహార పదార్థాల రుచులు లాంటివి ఎన్నెన్నో విశేషాలు, వింతలు అక్కడ ఉన్నాయి. వీటన్నింటి గురించి వివరిస్తూ సంధ్యా యల్లాప్రగడ రచించిన పుస్తకం ‘కార్తీకంలో కాశీయాత్ర’. ‘తలచెద గణపతిని…’ అని ప్రారంభమయ్యే ఈ కాశీ యాత్రా విశేషాల సమాహారం ముగిసేవరకూ విడవకుండా చదివిస్తుంది. కాశీకి వెళ్లిన అనుభూతిని కలిగించే ఈ పుస్తకం ఆ పురాతన మోక్షపురి వివరాలను తెలుసుకోవడానికి మార్గదర్శి.
కార్తీకంలో కాశీయాత్ర (కైవల్య సోపానం)
పేజీలు: 211; వెల: రూ. 150
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు: జె.వి. పబ్లికేషన్స్, ఫోన్: 80963 10140
పద్నాలుగు మేలి ముత్యాలు

‘పొక్కిలి వడ్డ వాకిలి శాన్పితోటి సక్కగ గాకపోదు’.. ఈ ఒక్కమాట చాలు. కరోనాకాలంలో అతలాకుతలం అయిన జీవితాలు మళ్లీ గాడిన పడతాయని చెప్పడానికి. ‘కరువుల కరువులెక్క పటేలుకు పైసలవసరమున్నయట బాకీ పైసలు ఇయ్యమన్నాడు’ ఓ మల్లయ్యకు మళ్లీ ఎదురైన కష్టం ఎటు దారితీసింది!
‘నా దగ్గర ఉన్న ఐదువేలు పంపిస్తాను సరిపోతాయా.. ఇంకా ఏమన్నా అరెంజ్ చేయమంటావా?’ లాక్డౌన్ వేళ ఓ వలసకూలీకి స్నేహితుడు ఇచ్చిన భరోసా!
‘ఇగురం’ సంకలనంలోని కథల్లోని వాక్యాలివి. ఆ అక్షరాల్లో అంతులేని వ్యథ ఉంది. ఆత్మీయ భరోసా ఉంది. అన్నిటినీ మించి సహజత్వం ఉంది. ‘ఇగురం’లో పొందుపరిచిన పద్నాలుగు కథలూ మేలి ముత్యాలే. విభిన్న వ్యక్తులు, వ్యక్తిత్వాల కలబోత ఈ కథలు. పల్లెదనం పల్లవించిన తీరులో, పల్లెజనం పలకరింపుల్లో తెలంగాణ భాష పరిమళం పులకరింపజేస్తుంది. తమ దుఃఖం ఎన్నటికీ ఇగిరిపోదని సతమతమవుతున్న రైతు జీవితాన్ని ‘ఇగురం’ కథలో హృద్యంగా ఆవిష్కరించారు రచయిత గంగాడి సుధీర్. మారుతున్న పరిస్థితులను బేరీజు వేసుకున్నాక ఆ రైతు పడే సంతోషంతో కథ ముగుస్తుంది. కథల్లో స్థానికతకు పెద్దపీట వేసిన రచయిత, సమకాలీన పరిస్థితులకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. కరోనా, లాక్డౌన్ చుట్టూ తిరిగే కథలు బడుగు జీవుల వ్యథలను కళ్లకు కడతాయి. కథా వస్తువు ఏదైనా, నేపథ్యం ఏదైనా కథా గమనంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అందంగా ఆవిష్కరించడంలో సఫలమయ్యారు.
ఇగురం(గంగాడి సుధీర్ కథలు)
రచన: గంగాడి సుధీర్
పేజీలు: 115, వెల: రూ.140
ప్రతులకు: 93944 86053
హర్షవర్ధన్ చింతలపల్లి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

