హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): వినేవాడు బీజేపీ కార్యకర్త అయితే.. చెప్పేవాడు బండి సంజయ్ అన్నట్టున్నది వ్యవహారం. బీజేపీ బుధవారం నిర్వహించిన రాష్ట్ర శిక్షకుల శిక్షణా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రసంగించారు. ఆయన చేసిన పలు వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ కాగా.. దానికి పలువురు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. నరేంద్రమోదీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరుగలేదా.. భారత్‌తోపాటు ఫ్రాన్స్‌ను కుదిపేసిన రాఫెల్ కుంభకోణం ఎవరి హయాంలో జరిగిందని శ్రీనివాస్ అనే నెటిజన్ నిలదీశారు. బీజేపీలో కుటుంబపాలన ఉండదు అని పేర్కొనగా.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబం ఎన్నితరాలుగా రాజకీయాలు చేస్తున్నదో తెలియదా.. అని వినోద్ అనే నెటిజన్ నిలదీశారు.
బండి: కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక అవినీతి ఆరోపణ కూడా లేదు.
ఇదీ నిజం: రాఫెల్ కుంభకోణం మన దేశాన్నే కాదు.. ఫ్రాన్స్‌ను కూడా కుదిపేస్తున్న సంగతి బండి సంజయ్ మర్చిపోయినట్టున్నాడు. ఇక బ్యాంకులను మోసం చేస్తున్న ఘటనలు గత ఏడేండ్లలో ఆరేడు రెట్లు పెరిగాయి. 2014-15లో బ్యాంకు మోసాల విలువ రూ.19,455 కోట్లు ఉంటే.. 2020-21 నాటికి ఏకంగా రూ.1.38 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు ఏడు రెట్లు. ఇక బడా మోసగాళ్లు దర్జాగా విదేశాలకు వెళ్లింది కూడా మోదీ హయాంలోనే. విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మోహుల్చోక్సీ.. ఇట్ల చెప్పుకుంటూపోతే చాంతాడంత లిస్టు.
ఇదీ నిజం: కొన్నేండ్లుగా కేంద్రంలో, రెండు తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవినీతిపరులందరూ బీజేపీలో చేరి పునీతులవుతున్న సంగతి అందరికీ తెలుసు.
ఇదీ నిజం: బీజేపీలో అనేక కుటుంబాలు వంశపారంపర్యంగా పదవులు అనుభవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవారినే గమనిస్తే..
1) కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. తండ్రి మాధవరావు సింధియా (కాంగ్రెస్), నాయినమ్మ విజయరాజే సింధియా (బీజేపీ) కూడా రాజకీయ నేతలే. మేనత్త వసుంధర రాజే సింధియా రాజస్థాన్ ముఖ్యమంత్రి
2) అనురాగ్ ఠాకూర్. ఆయన హిమాచల్‌ప్రదేశ్ సీఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్ కుమారుడు.
3) పీయూష్‌గోయల్. ఆయన తండ్రి వేద ప్రకాశ్ గోయల్.. కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ కోశాధికారిగా పనిచేశారు.
4) ధర్మేంద్ర ప్రధాన్. తండ్రి దేవేంద్ర ప్రధాన్. వాజపేయి మంత్రివర్గ సహచరుడు.
5) కిరణ్రెజిజు. ఆయన తండ్రి రించిన్ ఖహ్రు అరుణాచల్‌ప్రదేశ్ స్పీకర్‌గా పనిచేశారు.
6) అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు తండ్రి డోర్జీ ఖండు గతంలో సీఎంగా పనిచేశారు.