ముంబై, సెప్టెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ప్రారంభంలో 700 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్‌కు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 206.61 పాయింట్లు కోల్పోయి 80,157.88 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 45.45 పాయింట్లు కోల్పోయి 24,579.60 వద్ద స్థిరపడింది.
సూచీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటర్స్, ఎల్అండ్టీ, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, మారుతి, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. కానీ, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, రిలయన్స్, బీఈఎల్, టెక్ మహీంద్రా, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్, టెలికం, ఆర్థిక సేవలు, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లు నష్టపోగా..పవర్, యుటిలిటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ఎనర్జీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
దేశీయ కరెన్సీ మరింత బలహీనపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి బక్కచిక్కుతున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు కోల్పోయి రికార్డు స్థాయి 88.15కి పతనమైంది.