హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగనున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్టు వివరించారు.
నిరుడుతో పోలిస్తే 517 అభ్యర్థులు పెరిగినట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 199 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్టు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పెన్ను, పేపర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నీట్ అడ్మిషన్ కార్డు, ఐడీ ఫ్రూఫ్, పాస్పోర్టు సైజ్ ఫొటో తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఫోన్లు, డిజిటల్ వాచ్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.