కరీంనగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కార్పొరేషన్/ చొప్పదండి: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌కు కరీంనగర్ జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ నుంచి నగరంలోని మార్క్‌ఫెడ్ దాకా 6వేలకుపైగా బైక్‌లతో ర్యాలీ తీశారు. నగరంలోని మానేరు బ్రిడ్జికి చేరుకున్న అమాత్యుడు కేటీఆర్, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్‌లో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరారు. కోతిరాంపూర్, కమాన్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, మంకమ్మతోట, రాంనగర్ మీదుగా మార్క్‌ఫెడ్ మైదానానికి చేరుకున్నారు. సుమారు 2గంటల పాటు దారిపొడవునా నగరవాసులు నీరాజనం పట్టారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో టీఆర్ఎస్ నాయకులు హోరెత్తించారు. కోతిరాంపూర్, కమాన్ చౌరస్తాల్లో యువతీ, యువకులు మంత్రి కేటీఆర్‌పైకి పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కమాన్‌చౌరస్తాలో పలువురు యువకులు ‘ఫ్యూచర్ సీఎం కేటీఆర్’ అంటూ నినదించగా, మంత్రి కేటీఆర్ నవ్వుతూ వారికి అభివాదం చేశారు. ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా మార్కెఫెడ్ మైదానంలో మెప్మా సిబ్బంది ‘థ్యాంకు కేసీఆర్ సర్ ’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటు చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కొలిమికుంట గ్రామం నుంచి చొప్పదండిలోని తెలంగాణ చౌరస్తా వరకు చొప్పదండి, రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి, మల్యాల మండలాలకు చెందిన నాయకులు సుమారువెయ్యి బైక్‌లతో ర్యాలీ తీశారు. తెలంగాణ చౌరస్తా వద్ద ఒగ్గుడోలు కళాకారులు, మహిళలు బతుకమ్మ, బోనాలతో ర్యాలీగా వెళ్లి ఆహ్వానించారు.