టీ మాసయ్య/ వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 30: అమ్మలాంటి వేపకు ఆపదొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వేపచెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. అంతుబట్టని వ్యాధి తొలిచేస్తున్నది. మనుషులకు వచ్చే వివిధ వ్యాధులతోపాటు, పంటలకు సోకే చీడలను నిర్మూలించేందుకు వేప ఉత్పత్తులను వాడుతారు. అలాంటి వేపనే ఇప్పుడు చీడ తినేస్తున్నది.
అధిక వర్షాలతో..
రాష్ట్రంలో ఈ ఏడు విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో వేపచెట్లపై తేయాకు దోమ (టీ దోమ) జాతికి చెందిన పెద్ద పురుగులు, నల్లి పురుగుల దాడి పెరిగిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. ఈ పురుగులతోపాటు పొమాప్సిస్ అజాడిరెక్టి అనే శిలీంధ్రం వేపచెట్లపై దాడిచేస్తున్నదని, గాలిద్వారా సోకే ఓ రకం బ్యాక్టీరియా కూడా సోకుతున్నదని గుర్తించారు. వీటివల్ల వేప చిగుర్లు నల్లగా మాడిపోయి ఎండిపోతున్నాయని, మూడు నెలల్లోనే చెట్టు పూర్తిగా చనిపోతున్నదని తెలిపారు. వర్సిటీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు వారంపాటు ఈ తెగుళ్లపై పరిశోధన నిర్వహించారు. ఆ వివరాలను జగదీశ్వర్ ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. వాతావరణ మార్పుల వల్లనే వేప చెట్టుకు ప్రమాదం వచ్చిందని తెలిపారు. ఈ చీడల నివారణకు కార్భండిజమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రసాయనాలు చల్లే సమయంలో ఆ పరిసరాల్లోని నీటి వనరుల్లో అది కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ రసాయనం మనుషులు, మూగ జీవాలకు ప్రాణాంతకమైనందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏడాది లోపు వయసున్న వేప మొక్కలను సంరక్షించుకొంటే చాలని, ఆపై వయసుగల చెట్లు ఈ చీడల దాడిని తట్టుకొని బతుకగలవని పేర్కొన్నారు. నిత్యజీవితంలో అత్యంత ముఖ్యమైన వేప చెట్టును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు.
ఔషధ గని.. వేప
వేపచెట్టు ఔషధ గని. వేర్లనుంచి చిగుళ్ల వరకు ప్రతి భాగం ఔషధమే. ఆయుర్వేదంలో వేపాకు, పూత, కాయ, బెరడును విరివిగా వాడుతారు. డయాబెటిస్ నివారణలో వేపను వినియోగిస్తున్నారు. తెలంగాణలో ఏ పండుగ వచ్చినా వేపాకు లేకుండా పని జరుగదు. బోనాలు మొదలుకొని ఉగాది వరకు వేపాకు తప్పనిసరి. ఇండ్లల్లో దోమల నివారణకు కూడా వేపాకు పొగ వేస్తుంటారు. పంటలపై చీడపీడల నివారణకు వేప కషాయం పిచికారీ చేస్తారు.