హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బృహత్ ప్రకృతి వనాల (బీపీవీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మండల కేంద్రాలు, గ్రామాల్లో కనీసం 7 ఎకరాల స్థలాలు అందుబాటులో ఉన్నచోట వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మండలానికి 5 చొప్పున రాష్ట్రంలోని 545 గ్రామీణ మండలాల్లో 19,075 ఎకరాల్లో 2,725 బీపీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 188 బీపీవీల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 560 బీపీవీల్లో పనులు జరుగుతున్నాయి. 1,600 బీపీవీలకు స్థలాలను గుర్తించాల్సి ఉన్నది. ఇవన్నీ పూర్తయితే మొత్తం 20 వేల ఎకరాల్లో బీపీవీలు ఏర్పాటై పచ్చదనం భారీగా పెరుగుతుంది. ప్రభుత్వం ఒక్కో బీపీవీకి సగటున రూ.40 లక్షలు మంజూరు చేసింది. వీటి పనులను ప్రాధాన్య అంశంగా గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్లను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి 100% లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. 12,769 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని నిర్ణయించగా.. 109 గ్రామాల్లో పనులు పూర్తికావాల్సి ఉన్నది. వీటన్నిటి కోసం ప్రభుత్వం రూ.1,547 కోట్లు వెచ్చించింది. ఒక్కో వైకుంఠధామానికి దాదాపు రూ.12 లక్షలు కేటాయించింది. తడి, పొడి చెత్తను వేరుచేసేందుకు వీలుగా ఇప్పటివరకు 12,753 గ్రామాల్లో డంపింగ్ షెడ్లను నిర్మించారు. 16 గ్రామాల్లో మాత్రమే నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నది. ఈ పనులను కూడా ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సీఎస్ గడువు విధించారు. డంపింగ్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.319 కోట్లు వెచ్చింది.