తిరుమల, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): టీటీడీ అవసరాలకు ఉపయోగిస్తున్న బియ్యం, బెల్లం, పసుపు వంటి ముడిసరుకులను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన రైతుల నుంచే కొనుగోలు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను రక్షిస్తూ, సేవిస్తూ తద్వారా భూమాతను కాపాడితే ప్రపంచం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజెప్పడానికి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గో మహాసమ్మేళనం నిర్వహించినట్టు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో మహాసమ్మేళనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడు తూ.. తెలుగు రాష్ర్టాల్లోని గోశాలలను శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలతో అనుసంధానం చేసి, గోవుల పోషణకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమా న్ని దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా నిర్వహిస్తామని, ఇందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు, వేద పాఠశాలల నిర్వాహకులు సహకారం అందించాలని కోరారు. టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో 600కు పైగా ఉన్న గోశాలల అభివృద్ధికి కార్యాచరణ తయారుచేస్తున్నామని తెలిపారు. త్వరలో గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమం ముగిం పు సందర్భంగా గోమాత విశిష్టతను వివరిస్తూ సినీపాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన గీతాన్ని వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.