హిస్సార్: ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కిలోలు) తన నిఖార్సైన పంచ్‌తో జాతీయ మహిళల బాక్సింగ్ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల 52కిలోల తొలి బౌట్లో నిఖత్..ప్రత్యర్థి సియా వాల్కె(గోవా)పై అలవోక విజయాన్ని అందుకుంది. జరీన్‌తో పాటు ఢిల్లీ అమ్మాయి హేమలత (50 కి) కూడా తర్వాతి రౌండ్లోకి ప్రవేశించింది. హేమలత 4-0తో మంతసహ కుమారి (అస్సాం)పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సొంతం చేసుకుంది. మహారాష్ట్ర బాక్సర్ ఆర్య కులకర్ణి (52 కి) 5-0తో యేప్ బమంగ్ (అరుణాచల్‌ప్రదేశ్)ను మొదటి రౌండ్ నుంచి పూర్తి ఆధిక్యం సాధిస్తూ చిత్తు చేసింది. ప్రీతి చవాన్ (50 కి) తన పంచ్‌లతో మౌనిక పాండే (పశ్చిమ బెంగాల్)పై విజృంభించడంతో రిఫరీ అర్ధాంతరంగా ఆపేశాడు. కోమల్ (పంజాబ్) 5-0తో సోనియా గౌనీని ఓడించింది. అంజలి శర్మ (52 కి) 3-2తో వినోదిని (తమిళనాడు) చిత్తు చేసింది.