న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ కోచ్(Shooting Coach) అన్కుష్ భరద్వాజ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫరీదాబాద్‌లో ఆ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. గత ఏడాది డిసెంబర్ 16న ఈ ఘటన జరిగింది. దక్షిణ ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరిగిన పోటీల్లో ఆ అమ్మాయి పాల్గొన్నది. ఆ సమయంలో షూటర్‌ను వేధించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్ ఏరియాలో ఉన్న హోటల్‌కు వచ్చి కలవాలని భరద్వాజ్ షూటర్‌ను అడిగినట్లు ఫిర్యాదులో తెలిపారు.
తొలుత హోటల్ లాబీలో కలుసుకుందామని చెప్పాడు, ఆ తర్వాత రూమ్‌కు రమ్మన్నట్లు తెలిసింది. కెరీర్‌పై ఫోకస్ పెట్టేందుకు చర్చించాలని చెప్పి రూమ్‌కు తీసుకెళ్లినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని భరద్వాజ్ బెదిరించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐటీ ఫరీదాబాద్ వుమెన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 , బీఎన్ఎస్లోని సెక్షన్ 351(2) కింద కేసు పెట్టారు.