హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాత పెన్షన్‌ను సాధించి తీరుతామని, అప్పటివరకు విశ్రమించబోమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ప్రకటించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎంవోపీఎస్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో పెన్షన్ మహాసభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ నుం చి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయం లో ప్రభుత్వ ఉద్యోగులే విధులు నిర్వహిం చి ప్రజల ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక భద్రతను షేర్‌మార్కెట్ పాలుచేస్తున్నారని, దీంతో 76 లక్షల ఉద్యోగ కుటుంబాల భవిష్యత్తు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాఖండ్‌లో, కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నందున సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్, ఉత్తరప్రదేశ్ నుంచి విజయ్కుమార్బంధు, హర్యానా నుంచి దరివాల్సింగ్, ఉత్తరాఖండ్ నుంచి జిత్ మని పైనుల్లి సహా ఉ ద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.