
నీట్ తరహాలో ఇంజినీరింగ్‌కు జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) చైర్మ న్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే చెప్పారు. పలు రాష్ర్టాల్లో ప్లస్ టు సిలబస్ వేర్వేరుగా ఉండటం అడ్డంకిగా మారిందని తెలిపారు. కామన్ సిలబస్ అందుబాటులోకి వచ్చాక అన్ని రాష్ర్టాలు అంగీకరిస్తే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి కొత్త కోర్సుల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందగానే కొత్త కోర్సులకు అనుమతి ఇస్తామని తెలిపారు.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ కోర్సులు కొనసాగుతాయని, మెకానికల్‌లో త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, సివిల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మిళితం చేయడం ద్వారా కోర్ కోర్సులకు డిమాండ్ సృష్టించవచ్చని వెల్లడించారు. సాంకేతిక కోర్సుల్లో బోధన తీరుతెన్నులు మారాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రాంతీయ భాషల్లోనూ ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చామని, ఆరు భాషల్లో 19 రాష్ర్టాల్లో కొత్త కాలేజీలకు అనుమతులిచ్చామని వివరించారు.