ఖగోళ టైమ్ మెషీన్.. రెండ్రోజుల్లో రోదసిలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్
- కాంతి సాయంతో విశ్వ రహస్యాల ఛేదన
- హబుల్ కంటే 100 రెట్లు స్పష్టతతో చిత్రాలు
- రూ. 75,553 కోట్ల ప్రాజెక్టుకు నాసా శ్రీకారం

ఆదిత్య 369 సినిమా చూశారా? కాలంతో ప్రయాణించే టైమ్ మెషీన్ సాయంతో హీరో బృందం కృష్టదేవరాయల కాలంలోకి, భవిష్యత్తు ప్రపంచంలోకి వెళ్లి వస్తుంది. సరిగ్గా ఇలాగే.. కాంతి సాయంతో 1350 ఏండ్ల నాటి ఖగోళ రహస్యాలను ఛేదించటానికి నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్లు ‘జేవ్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ)’ను రూపొందించాయి. ‘ఖగోళ టైమ్‌మెషీన్’గా పిలుస్తున్న ఈ టెలిస్కోప్ శనివారం నింగికెగరనున్నది. విశ్వ రహస్యాలను నిగ్గుతేల్చే ఈ అద్భుత టెలిస్కోప్.. 400 ఏండ్ల పాటు శ్రమించినప్పటికీ సాధ్యంకాని ఆవిష్కరణలను కేవలం పదేండ్లలోనే సాక్ష్యాత్కరింపజేయనున్నది.
ఏమిటీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్?
గ్రహాలు, నక్షత్రాల పుట్టుక, ఖగోళంలో మార్పులు వంటి విశ్వ రహస్యాలను ఛేదించడానికి జేడబ్ల్యూఎస్‌టీ పేరిట ఓ భారీ, అత్యాధునిక టెలిస్కోప్‌ను నాసా శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపించనున్నారు. గడిచిన ముప్పై ఏండ్లుగా ఎన్నో అరుదైన ఖగోళ చిత్రాలను తీసి పంపించిన హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెడుతున్నారు. దృశ్యకాంతి కన్నా ఎక్కువ తరంగదైర్ఘ్యాలు కలిగి ఉండే నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాల్లో జేడబ్ల్యూఎస్‌టీ తొలినాళ్ల విశ్వాన్ని లోతుగా పరిశోధిస్తుంది.
ఎప్పుడు.. ఎక్కడ?
ఫ్రెంచ్ గయానాలోని ఈఎల్ఏ-2 లాంచ్‌ప్యాడ్ నుంచి ఏరియాన్ 5 రాకెట్ ద్వారా శనివారం జేడబ్ల్యూఎస్టీను పరిశోధకులు నింగిలోకి పంపించనున్నారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండో లాగ్రేంజ్ పాయింట్ (ఎల్2)లో ఈ టెలిస్కోప్‌ను ప్రవేశపెడుతారు. ప్రయోగం అనంతరం 30 రోజుల తర్వాత ఈ టెలిస్కోప్ నిర్ణీత ప్రాంతాన్ని చేరుకొంటుంది.
కీలకం కానున్న కాంతి సూత్రం
కాంతి వేగం సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అయితే, నిరంతరాయంగా విస్తరిస్తున్న విశ్వం గుండా సుదూరంలోని నక్షత్రాల నుంచి ప్రసరించే కాంతి మనల్ని చేరటానికి లక్షల ఏండ్ల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన ఇప్పుడు మనకు కనిపిస్తున్న వివిధ గెలాక్సీల్లోని నక్షత్ర కాంతి ఈనాటిది కాదు. బిగ్‌బ్యాంగ్ నాటి నక్షత్రాల కాంతి ఇంకా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాలతో ఆ కాంతిని పసిగట్టి.. 1350 ఏండ్ల నాటి నక్షత్రాలను.. నేటి నక్షత్రాలతో పోల్చుతూ.. విశ్వ రహస్యాలను జేడబ్ల్యూఎస్‌టీ ఛేదించనున్నది.
అవసరమేంటి?
1350 కోట్ల ఏండ్ల క్రితం విశ్వం ఉద్భవించిన వెంటనే చిమ్మచీకట్లలో మిణుకుమిణుకుమంటూ కొన్ని నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాలతో పనిచేసే జేడబ్ల్యూఎస్‌టీ తొలినాళ్ల విశ్వాన్ని కూడా చూడగలదని నమ్ముతున్నారు. మహా విస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) జరగ్గానే మొట్టమొదటిసారిగా ఏర్పడిన పురాతన నక్షత్ర మండలాలను నేటి భారీ స్పైరల్, దీర్ఘవృత్తాకార గెలాక్సీలతో పోల్చి చూడటమే జేడబ్ల్యూఎస్‌టీ ప్రధాన లక్ష్యం. అందుకే దీన్ని ‘ఖగోళ టైవ్ుమెషీన్’గా అభివర్ణిస్తున్నారు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావానికి కీలకంగా మారిన ధూళి మేఘాల మర్మం, నక్షత్ర కాంతి ప్రసరించే తీరును బట్టి సౌరకుటుంబం ఆవలి గ్రహాల్లోని వాతావరణం.. ఇలా మొత్తంగా విశ్వం పుట్టుక గుట్టు విప్పడానికి ఈ టెలిస్కోప్ కీలకం కానున్నది. ‘కాంతి సూత్రం’ ఆధారంగా ఈ లక్ష్యాలను జేడబ్ల్యూఎస్‌టీ సాధించనున్నది.

విశేషాలు..
- జేడబ్ల్యూఎస్‌టీ ప్రయోగం ఖర్చు రూ.75,553 కోట్లు. దీన్ని రూపొందించడానికి 25 ఏండ్ల సమయం పట్టింది. కాంతి ఆధారిత టైమ్‌మెషీన్ కాన్సెప్ట్ అభివృద్ధికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు.
- అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతి పెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే ఇది రెండున్నర రెట్లు పెద్దది.
- కంటితో కనిపించే నక్షత్రాలను.. ఈ టెలిస్కోప్ సాయంతో వెయ్యి కోట్ల రెట్ల స్పష్టతతో వీక్షించవచ్చు. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ టెలిస్కోప్ చిత్రాలను తీస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూపాయి నాణాన్ని సైతం స్పష్టంగా చూపించగలదు.
- పరారుణ కాంతిని వీలైనంత ఎక్కువగా గ్రహించటానికి వెబ్ టెలిస్కోప్ అద్దానికి 49.25 గ్రాముల బంగారు పూత పూశారు. హబుల్ టెలిస్కోప్‌లాగా జేడబ్ల్యూఎస్టీకి మరమ్మతు చేయలేం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

